'రైతు సంక్షేమమే వైయస్ఆర్ సీపీ లక్ష్యం'

పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా):

రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పని చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ కృషి చేస్తోందన్నారు. అనంతపురం జిల్లాలోని చిట్టూరు వంకలో సోలార్ పవర్ ప్లాంట్ వారు నిర్మించిన బావి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పాల్గొన్నారు.

     ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహానేత మరణానంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. హెచ్‌ఎల్సీ 10 టీఎంసీల సాగు నీరు అందించక పోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. చిట్టూరు సమీపంలోని పెన్నానదిలో అక్రమంగా బోరువేసి గంజిగుంటపల్లి వద్ద నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంటుకు నీటిని తరలిస్తే, కొన్ని వందల ఎకరాలు బీళ్లుగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.   రైతులకు సమస్యలు సృష్టించే పరిశ్రమలు అవసరం లేదని, రైతులకు అన్యాయం జరిగితే సహించమని ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ప్రజలను చంపి పరిశ్రమలకు నీరు అందజేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నా రు. బోరుబావిని పూడ్చివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Back to Top