రైతులంటే లెక్కే లేని కాంగ్రెస్ ప్రభుత్వం

తణుకు (ప.గో.జిల్లా) :

దేశానికి అన్నం పెట్టే రైతన్నలంటే కిరణ్‌ ప్రభుత్వానికి అస్సలు లెక్కే లేకుండా పోయిందని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ‘గోదావరి డెల్టా ఆధునికీకరణతో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరాలని మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిగారు రూ.1500 కో‌ట్లు మంజూరు చేస్తే.. ఆయన వెళ్ళిపోయాక పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికి 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గడచిన ఏడాది డెల్టా ఆధునికీకరణ పనుల కోసం రైతులు పంటను త్యాగం చేశారు. అయినా ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేయలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోండి. మళ్లీ ‘క్రాప్ హాలీడే’ పాటిస్తే పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి.. పాలకులు అనాలా.. రాక్షసులు అనాలా’ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం తణుకు జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి తొలుత పూలమాలలు వేసిన శ్రీమతి షర్మిల నివాళులు అర్పించారు. ‘తణుకు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాజశేఖరరెడ్డిగారు రూ.28 కోట్లతో 68ఎకరాల భూమిని సేకరించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించాలని భావించారు. కానీ ఈ‌ అసమర్థ కాంగ్రె‌స్ ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు’ అని విమర్శించారు.

‘దివంగత మహానేత డాక్ట‌ర్ వైయస్ రాజశేఖరరెడ్డి రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు. ఒక్క రూపా‌యి కూడా ఏ చార్జీ పెంచకుండా పథకాలన్నీ అమలు చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. రైతులకు నీళ్లిచ్చారు. ఉచిత కరెంటు ఇచ్చారు. విత్తనాలు, ఎరువులకు సబ్సిడీ ఇచ్చారు. పంటకు మద్దతు ధర దక్కేలా చూశారు. పంట నష్టపోతే నష్టపరిహారం అందించారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఉన్నతాశయంతో ఫీజు రీయింబర్సుమెంట్ పథకంతో ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు కల్పించారు. ఆరోగ్యశ్రీతో లక్షల మందికి లక్షల విలు‌వైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. దేశవ్యాప్తంగా పేదలకు 50 లక్షల ఇళ్ళుకట్టిస్తే.. మహానేత వైయస్‌ఆర్‌ ఒక్క మన రాష్ట్రంలోనే ఐదేళ్ళలో 50 లక్షల పక్కాఇళ్ళు కట్టించారు’ అని శ్రీమతి షర్మిల వివరించారు.

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ద్వారా కాంగ్రె‌స్ పార్టీకి జవసత్వాలు తెచ్చారని, ఈ ప్రభుత్వం వై‌యస్ కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తోందని‌ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య విమర్శించారు. ప్రజలంతా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఆయనతోనే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు.

Back to Top