రైతాంగంపై వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిందే

గుంటూరు 7
ఫిబ్రవరి 2013:
రాష్ట్ర ప్రభుత్వంపై అవసరమైనపుడు అవిశ్వాస తీర్మానం పెడతామని మీకోసం వస్తున్నా యాత్రలో తెలుగుదేశం  కార్యకర్త ఒకరు ప్రశ్నించినపుడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చెప్పడాన్ని వైయస్ఆర్ఆ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇంతకుముందు ఒకసారి ప్రవేశపెట్టినపుడు ఏమైందో తెలీదా అని ఆయన ప్రశ్నించారన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం పడిపోదన్న గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినపుడు మాత్రమే చంద్రబాబుకు ఆ అవసరమేర్పడుతుందని పేర్కొన్నారు. అస్తవ్యస్థంగా ఉన్నప్పుడు, మైనారిటీలో పడిపోయినపుడు అవిశ్వాస తీర్మానాన్ని అదును చూసి పెట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఆ ఆలోచన చేయడం లేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ధైర్యాన్ని
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు కోల్పోయారో  గుంటూరు గడ్డ మీద వివరించాలని అంబటి డిమాండ్ చేశారు. పాదయాత్రలో చంద్రబాబు ఇంకా అనేక అవాకులూ చెవాకులూ మాట్లాడారనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడనీ, ఆ పార్టీ జైలు పార్టీ అన్నారనీ చెబుతూ... అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటూ చంద్రబాబును అంబటి నిలదీశారు.  

ఎన్టీఆర్ నీగురించి ఏమన్నారో మరిచావా

    
తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో గుర్తుచేయదలచుకున్నానని చెప్పారు. 1996 ఫిబ్రవరిలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారన్నారు.  '1983 ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి. .. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన బతకనేర్చిన వాడు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత మా పంచకు చేరాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీలోని ముఖ్యులంతా చంద్రబాబును తీసుకోవద్దని సూచించారు. కానీ వినకుండా పార్టీలోకి రానిచ్చాను. మానవ సేవే ధ్యేయంగా సాగుతున్న నన్ను చూసైనా మంచి మార్గంలోకి మళ్ళుతారని ఆశించాను. కానీ ఒక స్వార్థపరుడికి ఎలాంటి మనఃప్రవృత్తి ఉంటుందో తెలుసుకోలేకపోయాను.

    
తన అవినీతి నాటకపు తెర తొలగిపోయిందని తెలిసిపోయిన సమయానికి చంద్రబాబు నీతి బాహ్యమైన చర్యలతో డబ్బు గడించిన చర్యలు బయట పడతాయని భయపడ్డాడు. అంతే తన కుట్రను అమలుచేయడానికి ఉపక్రమించాడు.

    
చంద్రబాబుకు ఇప్పుడున్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పమనండి. హెరిటేజ్ విలువెంత? ఎలా సంపాదించాడు? ఆయన హొటళ్ళ వ్యాపారం, తోటలు ప్రజలందరికీ తెలుసు. ఆయన నీతిమంతుడైతే నిజాయితీపరుడైతే ఆస్థులను ప్రకటించమనండి. అవి ఎలా సంపాదించాడో వివరించమనండి. ఆయన మీద ప్రజలలో ఛార్జీషీటు వేశాం. న్యాయం చెప్పమని వారివద్దకే వెడుతున్నాం. ఆయన పార్టీకి చేసిన నిర్వాకం ఫలితంగా తుక్కుతుక్కుగా ఓడిపోయింది. ఓ విద్యాసంస్థకు గుర్తింపునిస్తామని యాజమాన్యం వద్ద డబ్బు తీసుకున్నాడు. నా వద్ద తన పరపతిని ఉపయోగించి గుర్తింపు ఇప్పించాడు. ఇలాంటి ఆధారాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఎవరి దగ్గర ఎలా డబ్బు పుచ్చుకోవాలో బాబుకు బాగా తెలుసు. అవినీతిలో ఆయన నిష్ణాతుడు.'  ఇవి మేమో.. చంద్రబాబు వ్యతిరేకులో మాట్లాడింది కాదనీ, ఏ ఎన్టీఆర్ విగ్రహానికైతే దండలు వేసి బాబు మొక్కుతున్నారో ఆ ఎన్టీరామారావుగారే ఈ మాటలన్నీ చెప్పారని పేర్కొన్నారు. రాజకీయ బ్రోకరనీ, దేశంలోనే నీ అంత అవినీతిపరుడు లేడని ఎన్టీఆర్ సర్టిఫై చేశారన్నారు. ఈ విషయాలేవీ ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి, ప్రజలను తోకలా కొట్టించిన చంద్రబాబును అంత తొందరగా మరిచిపోరన్నారు.

 

అధికారంలో ఉన్నప్పుడు కిక్కకురుమనకుండా ఇప్పడు అవాకులూ చెవాకులా

    
ప్రకాశం బ్యారేజీ మీద నుంచుని కృష్ణా డెల్టాకు మహానేత అన్యాయం చేశారనీ, నీరివ్వలేదనీ చంద్రబాబు మాట్లాడారని అంబటి చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే, ఆల్మట్టి డ్యామ్ కడితే కిక్కురుమనలేదేమని ప్రశ్నించారు. ఆరోజు చక్రం తిప్పుతామని చెప్పి ఏం చేశారని అడిగారు.  అప్పట్టో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజపేయి, దేవెగౌడ ప్రభుత్వాలకు కొమ్ముకాసిన చంద్రబాబు దీనికి కారణభూతుడు కాదా అని నిలదీశారు.  కృష్ణా నీటి ఎగువ రాష్ట్రాలు దారి మళ్ళిస్తూ, బచావత్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా నీటిని దోచుకుంటూ ఉంటే మాట్లాడని చంద్రబాబు ఈ రోజు దివంగత మహానేత మీద బురద జల్లడం ఏమిటన్నారు. చంద్రబాబు రైతాంగం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. కృష్ణా డెల్టాకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడేనని స్పష్టంచేశారు. తన పరిపాలన కాలంలో పై రాష్ట్రాలు నీటిని దోచుకోవడానికి దోహదపడ్డ వ్యక్తని మండిపడ్డారు. కేంద్రంలో రాజకీయాలు చూసుకున్నారు తప్ప నీటి పంపకంలో జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నిద్రపోయారన్నారు. ఆరోజున వ్యవసాయం శుద్ధ దండగ అన్నారని చెప్పారు. ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగల మీద దుస్తులు ఆరేసుకోవాలన్నారన్నారు. కృష్ణా డెల్టాలో అసలు రెండో పంటకు నీరెందుకివ్వాలని ప్రశ్నించిన పెద్దమనిషివని ఎద్దేవాచేశారు. పొలాలు ఎండిపోతున్నాయి.. నీరు కావాలంటే పొలాలెండిపోతే నీరెందుకని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబని చెప్పారు. ఇక్కడ కాబట్టి ఊరుకుంటున్నారు గానీ వేరే దేశాల్లో అయితే రైతుల్ని ఉరివేస్తారంటూ కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తివన్నారు. ఈ అంశాన్నింటికీ కృష్ణా డెల్టాలో సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అంబటి స్పష్టంచేశారు.

Back to Top