న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో 2016 సెప్టెంబర్‌లోపు రైల్‌నీర్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించినట్టు తెలిపారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన ‘రైల్ నీర్’ అందించేందుకు తీసుకుంటున్న చర్యలు, విజయవాడ డివిజన్‌లో రైల్‌నీర్ ప్లాంట్ ఎప్పటిలోపు పూర్తి చేయనున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న ఆరు రైల్‌నీర్ ప్లాంట్‌లకు అదనంగా విజయవాడ సహా మరో ఆరు కొత్త ప్లాంట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. <br/><strong>ఈ ఏడాది రైల్వే కోచ్‌లెన్ని తయారు చేశారు: ఎంపీ మేకపాటి</strong><strong/>‘ఈ ఏడాది అవసరమైన రైల్వే కోచ్‌ల సంఖ్య, ఇప్పటి వరకు ఎన్ని అందుబాటులో ఉన్నాయి’ అని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో 3,314 కోచ్‌లను తయారు చేసినట్టు మంత్రి మనోజ్ సిన్హా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2013-14 ఏడాదిలో 3,658 కోచ్‌లు, 13,162 వ్యాగన్లు అవసరం ఉన్నట్టు అంచనా వేసినట్టు తెలిపారు. <br/>