రాజన్న పథకాలు కావాలంటే జగనే సిఎం అవ్వాలి

హైదరాబాద్, 25 ఫిబ్రవరి 2013: శ్రీ వైయస్ జగన్మో‌న్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తాను చేరనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రూపొందించి, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల తాను ఆకర్షితుడినయ్యానని గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. రాజన్న పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కావాలంటే శ్రీ జగనే ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. మహానేత వైయస్‌ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే శ్రీ జగన్‌ను జైలులో పెట్టారని రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని తాను గట్టిగా నమ్ముతున్నానని గొట్టిపాటి వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం కార్యకర్తల అభీష్టం మేరకే వైయస్‌ఆర్‌సిపిలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ కార్యక్రమాల్లో చురుకుగా పొల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రవికుమార్‌ చెప్పారు.

Back to Top