రాజన్న పథకాలకు ప్రభుత్వం తూట్లు

మోదుకూరు 18 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన పెట్టిన పథకాలన్నింటినీ నిర్లక్ష్యం చేస్తోందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా మోదుకూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రసంగించారు.  కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. రాజశేఖరరెడ్డిగారు జీవించి ఉంటే పొలాలకు తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా అయ్యేదనీ, ప్రతి కుంటుంబానికీ ముప్పై కేజీల బియ్యం అందేదని ఆమె చెప్పారు. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులకైతే మూడు గంటలు, గ్రామాలకైతే నాలుగు గంటలు, పరిశ్రమలకు నెలకు రెండు రోజులు పవర్ హాలిడే.. ఇలా ఉంది పరిస్థితని వివరించారు. లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. విద్యార్థులదీ ఇదే పరిస్థితి. చదువుకుందామంటే ఫీజులు కట్టలేక ఇంట్లో కూర్చుంటున్నారంటే ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో వేరే చెప్పనక్కరలేదన్నారు. మహానేత ఉన్నప్పుడు ఫీజు రీయింబర్సుమెంటు పథకంలో లక్షలాది మంది విద్యార్థులు నిర్భయంగా చదువును కొనసాగించారన్నారు. ప్రతి రంగంలోనూ ఛార్జీలు పెరిగాయన్నారు. కరెంటు బిల్లులు 500 నుంచి  వెయ్యి రూపాయల వరకూ ప్రతి ఒక్కరికీ వస్తోందన్నారు. ఇది చాలదన్నట్లు ఏకంగా ముప్పైరెండువేల కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన మోపి రక్తం పిండుతోందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో ఏ ఒక్క రోజూ చార్జీలు పెంచని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఏ చార్జీలు పెంచకుండానే, ఏ పన్ను వేయకుండానే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు, పక్కా ఇళ్ళు తదితర పథకాలను అమలుచేశారని చెప్పారు.  

మాకీ ప్రభుత్వం వద్దని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతూ ఉంటే.. చంద్రబాబు దీనిని నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకవద్దని విప్ జారీ చేశారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిత్రత్వం వెల్లడైందన్నారు. సొంత మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు అందరికంటే అవినీతిపరుడని ఎన్టీఆర్ అన్న విషయాన్ని శ్రీమతి షర్మిల ప్రజలకు గుర్తుచేశారు. ఈ సందర్భంలో ప్రజలనుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కరతాళ ధ్వనులతో వారు తమ ఆనందాతిరేకాలను వ్యక్తంచేశారు. చంద్రబాబుకు దేశ విదేశాలలో వేల కోట్ల ఆస్తులున్నాయని పేర్కొంటూ 'అవినీతి ఖజానా-చంద్రబాబు జమానా' పేరుతో వామపక్షాలు పుస్తకం కూడా ప్రచురించారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కనక ఆయనపై ఏ విచారణ చేపట్టకుండా ఉన్నారన్నారు.

కుమ్మక్కు కాలేదు కనకనే జగనన్న మీద అబద్ధపు ప్రచారాలు చేస్తూ, తెలుగు దేశం పార్టీతో కలిసి కేసులు పెట్టి జైలులో ఉంచారని శ్రీమతి షర్మిల చెప్పారు. వీరి స్వార్థ రాజకీయాల కోసం జగనన్న జీవితాన్నే కాకుండా కోట్లాది ప్రజలను కూడా పణంగా పెట్టి చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. వీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగనన్న వెరవరని చెప్పారు. బోనులో ఉన్నా సింహం సింహమేనని శ్రీమతి షర్మిల అన్నప్పుడు ప్రజలు ఈలలు, కేరింతలతో సమాధానం చెప్పారు. దేవుడున్నాడనేది ఎంత నిజమో.. మంచి వారి పక్షాన ఆయన నిలబడతాడనేది కూడా అంతే నిజమన్నారు. ఉదయించే సూర్యుని ఎలా ఆపలేమో.. జగనన్నని కూడా ఆపలేరన్నారు. తన రోజు వచ్చినపుడు జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యాన్ని స్ధాపిస్తారని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. ఆ రెండు పార్టీలు మట్టిగొట్టుకుపోతాయన్నారు. ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు జగనన్న చేసిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తాడనీ, రాజన్న పథకాలను అమలుచేస్తాడనీ ఆమె తెలిపారు. ఆరోజు వచ్చేంత వరకూ మీరంతా జగనన్నను ఆశీర్వదించాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనీ శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Back to Top