రైతు ద్రోహిని నిలదీయండి

హైదరాబాదు: సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి షుగర్ ఫ్యాకర్టీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్న రైతుద్రోహి చంద్రబాబును నిలదీయాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులురెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి కోరారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సహకార సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గాజులమండ్యం, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గాజులమండ్యంకు సంబంధించి 12,500 మంది రైతులకు రూ.9.50 కోట్లు, చిత్తూరులో 15,000 మంది రైతులకు రూ.8.20 కోట్ల బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. రెండు ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రిని నిలదీయాలని జగన్‌మోహన్ రెడ్డిని కోరారు.

గసగసాల రైతులపై అక్రమ కేసులను అడ్డుకోండి

జిల్లాలోని రైతులు అవగాహన లేక వేలాది ఎకరాల్లో గసగసాలు సాగు చే స్త్తున్నారని వారిపై ఎక్సైజ్ అధికారులు అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రైతు విభాగం నేతలు ఆదికేశవులురెడ్డి, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన పంటను అధికారులు ధ్వంసం చేసి కేసుల పెట్టినట్లు వివరించారు.

రెతులపై పెట్టిన అక్రమ కేసులను మాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, చక్కెర ఫ్యాక్టరీలను కాపాడుకునేందుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని హామీ ఇచ్చినట్లు ఆదికేశవులురెడ్డి తెలిపారు.
Back to Top