పురపాలన అస్తవ్యస్థం

 • పట్టించుకోని
  మంత్రి నారాయణ
 • విదేశీ పర్యటనలు, సీఆర్‌డీఏలతో
  బిజీబిజీ
 •  సమ్మెబాటలో తాత్కాలిక ఉద్యోగులు
 •  ఆంధ్రప్రదేశ్‌లో పురపాలన అస్తవ్యస్థంగా
  మారింది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం
  ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వాటిని పట్టించుకోవడం మానేసింది. పురపాలికల బాగోగులనే
  పట్టించుకోని ప్రభుత్వం వాటిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పట్టించుకుంటుందని ఎలా
  ఆశిస్తాం?
  ఇక పురపాలక మంత్రి నారాయణ తన శాఖపై దృష్టిపెట్టిన దాఖలాలే లేవు. కొత్త
  రాజధాని కోసం భూసమీకరణ పనుల్లోనూ, విదేశీ పర్యటనలలోనూ ఆయన బిజీగా
  ఉన్నారు. దాంతో మున్సిపాలిటీలలోనూ, కార్పొరేషన్లలోనూ అనేక సమస్యలు
  పెండింగ్‌లో పడిపోయాయి. వేతనాలను పెంచాలని కోరుతూ తాత్కాలిక ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు.
  త్వరలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా వారికి మద్దతుగా సమ్మె బాట పట్టనున్నారు. గురువారం
  నాడు రాష్ర్టవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు.

   సమ్మెలో తాత్కాలిక ఉద్యోగులు

   ఆంధ్రప్రదేశ్‌లో 96 మున్సిపాలిటీలు,
  15 కార్పొరేషన్లలో సుమారు 70 వేల మంది కాంట్రాక్ట్,
  ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే ఐదువేల
  మంది సిబ్బంది పురపాలక విధులనుచూస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు
  పరిష్కరించాల్సిందిగా రాష్ర్టంలోని అన్ని పురపాలక సంఘాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్,
  ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఏడాదిగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ తెలుగుదేశం
  ప్రభుత్వానికి అది చెవిటివాని ముందు శంఖమూదిన చందంగా మారింది. ప్రభుత్వం ఎంతకీ స్పందించకపోయేసరికి
  అనివార్యపరిస్థితుల్లో చివరకు సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. శాశ్వత ఉద్యోగులకు
  పీఆర్‌సీ ఇచ్చినట్లే తమకు కూడా కనీస వేతనం రు.15 చేయాలని తాత్కాలిక
  ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
  (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్
  సిబ్బంది చేస్తున్న సమ్మె వల్ల పారిశుధ్య పరిస్థితి అస్తవ్యస్థంగా తయారయ్యింది. ఇదే
  పరిస్థితి ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో
  దర్శనమివ్వబోతున్నది.

   పుష్కరాలు, పుణ్యక్షేత్రాలలో పరిస్థితి దారుణం...

   ఈనెల 14 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమౌతున్నాయి.
  ఆ సందర్భంగా రాష్ర్టంలోని రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురంలలో ప్రతిరోజూ లక్షలాది మంది పుష్కరఘాట్లకు పోటెత్తుతారు. అవే కాక
  పనిలో పనిగా పుష్కర స్నానాలు ఆచరించిన వారు అన్ని పుణ్యక్షేత్రాలనూ సందర్శిస్తారు.
  తిరుపతి, విజయవాడ, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకైతే ఎప్పుడూ
  ఉండే రద్దీ దాదాపు రెట్టింపు అయ్యే అవకాశముంది. పారిశుద్యం, వీధి
  దీపాలు వెలిగించడం, నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం వంటి
  పనులను ఈ తాత్కాలిక సిబ్బంది చూస్తుంటారు. వీరు సమ్మెలోకి వెళ్లడం అంటే ఈ పనులన్నిటికీ
  బ్రేక్ పడిపోయినట్లే. పుష్కరాల నేపథ్యంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న
  చంద్రబాబు ప్రభుత్వం మున్సిపల్ సిబ్బంది సమ్మె సైరన్ మోగించేవరకు ఎందుకు ఉపేక్షించినట్లు?

   విదేశీపర్యటనలతో నారాయణ బిజీ

   మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది కాలంలో
  ఏడుసార్లు విదేశీ పర్యటనలు చేసిన మంత్రి నారాయణ ఎప్పుడూ ఆ టూర్లలోనే బిజీగా ఉన్నారు.
  ఇక రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పనులను కూడా ఆయన ప్రత్యక్షంగా దగ్గరుండి
  చూసుకుంటున్నారు. రాజధాని భూ సమీకరణ వ్యవహారాలు చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలో
  నారాయణది ప్రత్యేకమైన స్థానం. అందువల్ల ఆయన 
  ఎప్పుడూ ఆ పనులలో బిజీ. అందువల్లే ఆయనను పలుమార్లు కలుసుకున్నప్పటికీ తమ సమస్యలపై
  ఆయన దృష్టిపెట్టలేకపోతున్నారని మున్సిపల్ సిబ్బంది నేతలు వాపోతున్నారు. నాలుగైదుసార్లు
  మంత్రిని కలిసినా ఉపయోగం లేకపోయిందని వారంటున్నారు.

   మంత్రిగారి మీనమేషాలు

   గురువారం అర్ధరాత్రి నుంచే తాత్కాలిక ఉద్యోగులు సమ్మెలోకి
  వెళ్లిపోయారు. అయితే 11వ తేదీన చర్చలు జరుపుదామని మంత్రి నారాయణ నేతలకు కబురు చేసినట్లు చెబుతున్నారు.
  అంటే సమ్మె ప్రారంభమైన రెండు రోజుల తర్వాత గానీ ఆయన చర్చలు జరపరన్నమాట. గురువారం విదేశీ
  పర్యటన నుంచి వచ్చిన నారాయణ శుక్రవారమే చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సింది
  పోయి మరో రోజుకు వాయిదా వేయడం చూస్తుంటే ఉద్యోగుల సమస్యల పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి
  ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Back to Top