రాష్ట్రం తగలెడిపోతుంటే నీకు పబ్లిసిటీ కావాలా..?

– రబీ మొదలై రైతులు నానా అవస్థలు పడుతున్నారు
– మమతా బెనర్జీ కన్నా నీవేమైనా గొప్పవాడివా..?
– మంచి జరిగితే నీ క్రెడిట్‌.. సమస్యలొస్తే అధికారులపై విసుర్లా
–  ఇప్పటికైనా పబ్లిసిటీ కట్టిపెట్టి..రైతు సమస్యలపై దృష్టిపెట్టు
– చంద్రబాబుకు వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి హితవు 

హైదరాబాద్ః ఓవైపు 500, వెయ్యి రూపాయల నోట్లు చెల్లక రాష్ట్రం తగలెడిపోతుంటే  నారా చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన మన ఆంధ్రాలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బుల్లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే చంద్రబాబు మాత్రం నోట్ల రద్దుకు నేనే కారణమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారో తెలియజెప్పాలని డిమాండ్‌ చేశారు. 

రబీ మొదలైంది.. ప్రత్యామ్నాయం ఏదీ
ఇప్పటికే పలు ప్రాంతాల్లో రబీ మొదలై రైతులు పంటలు సాగుచేస్తుండగా మోడీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు. డిసెంబర్‌ 30 వరకు రైతులను  బ్యాంకులు గడప కూడా తొక్కనిచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. వారంతా నోట్లు మార్చుకునేందుకు క్యూలైన్లలో నిల్చుంటే వ్యవసాయం ఏం చేయగలరని ప్రశ్నించారు. బ్యాంకులు రుణాలివ్వక, వారి వద్ద ఉన్న డబ్బులు చెల్లక.. అప్పులు దొరికే పరిస్థితి లేక రైతులు పడే పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయని వాపోయారు. 

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులుండవు.. ఏటీఎంలు పనిచేయవు.. రైతుల వద్ద డబ్బులుండవు.. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం పాకులాడటం దారుణమన్నారు. ఏదైనా మంచి జరిగితే అంతా తానే చేసినట్లు చెప్పుకోవడం.. తప్పు జరిగితే అధికారుల మీద సీరియస్‌ కావడం.. పత్రికల్లో వార్తలు రాయించుకోవడం బాబుకు బాగా అలవాటైపోయిందని కాకాని మండిపడ్డారు.  ఈ సీజన్‌లో రైతులకు రూ.34వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి ఒక్కశాతం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 

మమతా బెనర్జీ కన్నా నీతిమంతుడివా..
చంద్రబాబు తానొక్కడే నీతి మంతుడైనట్లు మాట్లాడతారని కాకాని విమర్శించారు. ఆయనేమీ మమతా బెనర్జీ కన్నా నీతి మంతుడు కాదన్నారు. ముందుగానే తన డబ్బును, బినామీల పేరు మీద ఉన్న నగదును తెల్లడబ్బుగా మార్చుకుని ఇప్పుడేమో దొంగ లేఖ రాసి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు గురించి ముందే తెలుసుకొని బాబు తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని, అమరావతి ప్రాంత రైతులు మాత్రం పొలం అమ్ముకోగా వచ్చిన డబ్బును ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.  నల్లధనం వెలికతీతకు  వైయస్సార్సీపీ ఏనాడు వ్యతిరేకం కాదని అయితే ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతుందని తెలిపారు. 

ప్రపంచంలోనే మేధావినని చెప్పుకుంటున్న బాబు రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలన్నారు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తన స్థాయికి ఇక్కడ పుట్టాల్సిన వాడిని కాదని .. తన కవల సోదరుడితో కలిసి అమెరికాలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రైతు కూలీలు, కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ డబ్బులు మార్చుకోవడం కోసం క్యూలైన్లలో నిల్చోవడమే సరిపోతోందని ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు గడిచేదెలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు పబ్లిసిటీ పనులు కొంచెం పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని కాకాని హితవు పలికారు. 
Back to Top