'ప్రతినెల ఒకరోజు జీతం ఎలా అడుగుతావు బాబు'

హైదరాబాద్: ప్రజధనాన్ని వృథాచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగుల నుంచి ప్రతినెల ఒకరోజు జీతం ఎలా అడుగుతారని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల నుంచి ప్రతినెల ఒకరోజు జీతం అడిగే బదులు సింగపూర్ యాత్రలు, ప్రైవేటు జెట్ విమానాల్లో ప్రయాణాలు మానుకుంటే.. ఆ డబ్బులు చంద్రబాబుకు మిగులుతాయి కదా? అంటూ ఎద్దేవా చేశారు.

అలాగే సింగపూర్, హెరిటేజ్ల్లో చంద్రబాబు అక్రమంగా దాచిన ఆస్తులను రాసిస్తే.. బాగుంటుంది కదా? అని ఘాటుగా విమర్శించారు. అయితే ఏపీ నూతన రాజధానిని కట్టిస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు.. చంద్రబాబు ఉద్యోగుల నుంచి జీతాలు ఎలా అడుగుతారని ? ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు 'ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి' అని కోరిన సంగతి తెలిసిందే.

Back to Top