ప్రభుత్వంపై 'అవిశ్వాసం' ఎందుకు పెట్టరు?


విరుపాపురం

(కర్నూలు జిల్లా) 12 నవంబర్ 2012: ప్రజావ్యతిరేకమైన ఈ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని షర్మిల నిలదీశారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్‌, టిడిపి నీచమైన కుమ్మక్కు రాజకీయాలతో ఆధారాలు లేకున్నా జగనన్నను విచారణ పేరుతో జైలు పాలు చేశారని ఆమె దుయ్యబట్టారు. అయితే దేవుడే జగనన్నను బయటకు తీసుకువస్తాడన్నారు. అప్పుడు జగనన్న 'రాజన్న రాజ్యం' దిశగా మనలను నడిపిస్తాడన్నారు. అంతవరకు జగనన్నకు మీ ఆశీర్వాదం కావాలన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురం గ్రామంలో షర్మిలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
కాగా, వైయస్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదని, కిరణ్ ప్రభుత్వం మాత్రం పన్నుల ప్రభుత్వంగా మారిందనీ బెనగిరిగ్రామం మహిళలు నిందించారు. సంవత్సరానికి ఆరు సిలిండర్లిస్తే ఏం వండుకోవాలి? ఏం తినాలి? అని మహిళలు వాపోయారు. పాదయాత్రలో భాగంగా బెనగిరి మీదుగా సాగిన షర్మిల వారితో కాసేపు ముచ్చటించారు. ఈ మహిళల సూటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. బోర్లలో నీళ్లు లేక నానా బాధలు పడుతున్నామనీ, తమ కష్టాలు దేవుడే ఎరుకనీ గ్రామస్థులు షర్మిలకు మొరపెట్టుకున్నారు. బెనగిరిలో షర్మిలకు సాదర స్వాగతం లభించింది. ఇదిలావుండగా దిబ్బనకల్లు చేరుకోవడంతో నేటికి షర్మిల పాదయాత్ర ముగిసింది.షర్మిల సోమవారం 13.6 కిలోమీటర్లు నడిచారు. 26 రోజులలో మొత్తం 338.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

Back to Top