ప్రజలవైపా.. ప్రభుత్వంవైపా తేల్చుకోండి: షర్మిల

కర్నూలు: ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చెప్పారు. మీరు అవిశ్వాసం పెట్టండి.. లేదా మేం పెడతాం మద్దతివ్వండని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు. మీరు చేపట్టిన పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర 31వ రోజు ముగిసేనాటికి  404 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబుపై మాటల శరాలు విసిరారు. సవాళ్ళూ చేశారు.
     ‘చంద్రబాబు నాయుడు గారూ! ఇదిగో.. ఈ ప్రజల మాటలు, వాళ్ల గోడు మీకు వినిపిస్తోందా? ప్రజలకు ఏమీ చేయలేని ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ పాదయాత్రలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీలో విశ్వసనీయత అనేది ఉంటే వెంటనే అవిశ్వాసం పెట్టండి. కానీ మీరేమో అవిశ్వా సం పెట్టనుగాక పెట్టను అంటారు. కాబట్టి మేమే అవిశ్వాసం పెడతాం.. దానికి మీరు మద్దతు ఇస్తారా? సూటిగా చెప్పండి. మీరు ప్రజల పక్షం ఉంటారో..ప్రభుత్వం పక్షం ఉంటారో తేల్చుకోండి’ అని ఆమె సవాలు విసిరారు.

బోరు నీళ్ళు తోడుకుందామన్నా కరెంటు లేదు

     తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద మహిళలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ‘అమ్మా.. బోరులో నీళ్లు తోడుకొని తాగుదామన్నా కరెంటు ఉండటం లేదు.. తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉంది. వానలు లేక పంటలు ఎండిపోయినయ్.. నష్ట పరిహారం ఇస్తామన్నారు కానీ ఇంత వరకు లేదు. జ్వరం వస్తే పస్తులు పడుకుంటున్నాం.. మొన్ననే చంద్రబాబు గారి పాదయాత్ర మా ఊరి నుంచే పోయింది. ఆయనకూ మా బాధలు చెప్పినం. ఇది పనికిరాని ప్రభుత్వం.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితే మీకు మేలుచేకూరుతుందన్నారు.. బాబుగారు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని టీవీల్లో చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బాబుగారు కూలగొట్టడం లేదమ్మా’ అని ఇదే గ్రామానికి చెందిన వెన్నెల మహిళా గ్రూపు సభ్యులు తోడేళ్ల రామలింగమ్మ, నర్సమ్మ షర్మిలను అడిగారు.

ఇల్లు ఇవ్వట్లేదు.. బిల్లూ ఇవ్వట్లేదు..

     ‘వైయస్ఆర్ ఇలాంటి గ్రామాలకే వచ్చి రచ్చబండ మీద నిలబడి ‘అర్హులై ఉండి ఇల్లు లేని నిరుపేదలు ఉంటే చెయ్యి ఎత్తండి’ అని అడిగితే ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదనుకున్నారని షర్మిల చెప్పారు. అంతలా ప్రజలకు మేలు చేయాలని ఆయన ఆశించారన్నారు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టివ్వాలని కలలుగన్నారు. కాని ఈ చేతగాని ప్రభుత్వం వైయస్ఆర్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.   వైయస్ఆర్ మంజూరు చేసిన ఇంటికి కూడా ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేకపోతోందన్నారు. ప్రజలు.. మహిళలు.. విద్యార్థులు.. రైతులు.. కూలీలు ఏ ఒక్కరి సమస్యలు కూడా వారికి పట్టడం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి మళ్లీ అక్కడికే వెళ్లి నాకో అవకాశం ఇవ్వాలంటూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్షం కాదు. కాంగ్రెస్‌కు టీడీపీ మిత్రపక్షంగా మారింది’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు..

     31వ రోజు ఉదయం ఎమ్మిగనూరు శివారులోని గణేశ్ రైస్ మిల్ నుంచి బయలుదేరిన షర్మిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం కలగొట్ల, తిమ్మాపూరు చేరేవరకు వేలాది మంది జనం పాదయాత్రలో ఆమె వెంట నడిచారు. తిమ్మాపురంలో ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ ఏడు తరగతులకుగాను మూడే గదులు ఉన్నాయి. విద్యార్థులకు చెట్లకింద పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఇదా? అని ప్రశ్నించారు. నవంబర్ గడుస్తున్నా ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వక పోవటాన్ని ఆమె తప్పు పట్టారు. తిమ్మాపూరం మీదుగా గార్లదిన్నె, దైవందిన్నె గ్రామాలవైపు వస్తుండగా రైతు కూలీలు ఎదురుగా వచ్చి ఎండిపోయిన పత్తి చెట్లను, నాణ్యత లేని దిగుబడి వచ్చిన పత్తిని షర్మిలకు చూపించారు. దైవందిన్నెలో కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కాంపాడు గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.45 షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 403.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

Back to Top