ప్రజల కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయం

హైదరాబాద్, 7 ఏప్రిల్‌ 2013: ప్రజల కన్నీటిలో కాంగ్రెస్‌ కొట్టుకుపోవడం ఖాయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్య సలహాదారు విపక్ష నేత చంద్రబాబే అ‌ని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. రెబెల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల 'కరెంట్‌ సత్యాగ్రహం' దీక్షకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ శ్రీమతి విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు. శ్రీమతి విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మద్దతుగా ఉన్న కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం ఉదయం విరమించారు. ప్రముఖ సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, రైల్యేకోడూరుకు చెందిన రైతు వెంకట్రామయ్య శ్రీమతి విజయమ్మకు, ప్రజాప్రతినిధులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నిమ్సు ఆస్పత్రిలో దీక్ష విరమించిన అనంతరం శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడారు.

శ్రీమతి విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..
'కరెంటు చార్జీల పెంపు, విద్యుత్‌ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం ఐదు రోజులుగా కరెంట్‌ సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నాం. కానీ, ముఖ్యమంత్రిగారేమో ప్రతిపక్షాల దీక్షలను ఎగతాళి చేశారు. దీక్షా శిబిరం వద్ద రాత్రిపూట కనీసం ఒక డాక్టర్‌ను కూడా నియమించని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఆయన అధికార దర్పానికి సూచికగా నిలుస్తున్నాయి. విద్యుత్‌ సమస్యకు గ్యాస్‌ లేదు, నీరు, బొగ్గు లేదు మేమేం చేస్తామనే నిర్లక్ష్య ధోరణి వల్ల ముఖ్యమంత్రికి ముందు చూపు లేదని స్పష్టం అవుతోంది. ఆయనకు ముందు చూపు లేకపోవడం వల్లే విద్యుత్‌ సమస్య ఎదురైంది. కరెంటు చార్జీల పెంపు భారం మోయాల్సి వస్తోంది.'

'రాష్ట్ర ప్రజల మీద సుమారు రూ. 32 వేల కోట్లు ఆర్థిక భారం వేయడమే కాకుండా మళ్ళీ మేం అది చేశాం.. ఇది చేశాం అని చెబుతున్నారు. ఇంతకు ముందు రూ. 4 వేల కోట్ల భారం వేసి రూ. 170 కోట్లు తగ్గించామని చెప్పారు. ఇప్పుడు కూడా రూ. 6,300 కోట్లు పెంచి రూ. 830 కోట్లు తగ్గించామని చెబుతున్నారు. అది కూడా తగ్గించడమంటే విపక్షాలు చేసిన ధర్నాల వల్ల, దీక్షల వల్లే ఈ మాత్రమైనా తగ్గించారనుకుంటున్నాం. వేసిన ఆర్థిక భారం అంతా వేసి ఈ రాష్ట్ర ప్రజలకు భిక్షం వేస్తున్నారా? అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అయినప్పటికీ అన్నిటి మీదా చార్జీలు పెంచుతోంది ఈ ప్రభుత్వం. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు ఒక్క వ్యవస్థ మీద కూడా ఒక్క పైసా పెంచకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచి రూ. 1.700 కోట్ల వరకూ భారం వేసింది. కరెంటు చార్జీలు పెంచారు. గ్యాస్‌ ధర పెంచారు. మద్యం ధరలు పెంచారు. భూముల విలువలు తగ్గినా రిజిష్ట్రేషన్‌ చార్జీలు బాగా పెంచారు. వ్యాట్‌ పెంచారు. పోనీ సంక్షేమ పథకాలన్నా బాగా నడిపిస్తున్నారా అంటే.. వైయస్ పెట్టిన సంక్షేమ పథకాలు గాని, ఆయన చెప్పిన మాటలను గానీ ఏదీ చేయని పరిస్థితి ఉంది.'

'కోటీ 80 లక్షల మందికి రూ. 830 కోట్లు తగ్గించామని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. రాష్ట్రంలో కరెంటు ఉంటే కదా తగ్గించడానికి?.. పల్లెల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అధికారికంగానే 12 గంటలు కరెంటు సరఫరా కట్. ‌నగరాల్లో కూడా 6 గంటలు కట్‌. పల్లెల్లో కరెంట్‌ ఉండాల్సిన 12 గంటల్లో కూడా ఒక్క గంట, రెండు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఉంది. తాగునీటికి ఇబ్బందిగా ఉంది. ఆస్పత్రులకు, విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఒక బెడ్‌లైట్‌, ఒక టి.వి., సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం 200 యూనిట్లు అవుతుందట. 200 యూనిట్లకు పైన ఒక్క యూనిట్‌ వాడినా 300 యూనిట్ల స్లాబ్‌లోకి విద్యుత్‌ బిల్లు రేటు పెరిగిపోతుంది. రాజశేఖరరెడ్డిగారు పెట్టిన ఉచిత విద్యుత్‌ నామరూపాల్లేకుండా పోతోంది. రెండు మూడు గంటలు కూడా కరెంటు ఉండడం లేదు. రైతులు ఇంత‌గా ఇబ్బందులు పడుతూ ఉంటే తాము 3.70 లక్షల మందికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఇల్లెందు మీటింగ్‌లో చెప్పారు. అంత కరెంటు ఇస్తుంటే పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? కిరణ్‌కుమార్‌రెడ్డి పైలాన్‌లు వేసుకోవడం కాకుండా పల్లెల్లోకి వెళ్ళి చూస్తే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ఎంతగా చీకట్లు ఉన్నాయో తెలుస్తుంది.'

'పరిశ్రమలకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దాదాపు లక్షా 40 వేల చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మూతపడ్డాయని చెబతున్నారు. మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. వాళ్ళకూ ఎటువంటి హామీ ఇవ్వలేదు. చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలను పిలిచి కనీస భరోసా కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు 24 గంటలూ కరెంటు ఇస్తామని భరోసా ఇచ్చారు. పారిశ్రామికవాడలను కూడా ఆయన అభివృద్ధి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డిగారు చేస్తే ఇప్పుడు కనీసం పారిశ్రామికవేత్తలను పిలిచి బ్యాంకు రుణాలకు వడ్డీని వచ్చే సంవత్సరం కట్టుకునేలా చేస్తామన్న హామీ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేం బాగా చేశాం అని కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా చెప్పుకుంటారు? విపక్షాలు మోసపూరితంగా ఉద్యమాలు, దీక్షలు చేస్తున్నాయని ఎలా ఆరోపిస్తారు? అన్నీ బాగా చేస్తే మోసపూరితంగా దీక్షలు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం విపక్షాలకు లేదు.'

'విపక్షాలు కార్చే కన్నీరు ఎన్నికల్లో వరదలవుతాయని కిరణ్‌కుమార్‌రెడ్డి భయపడుతున్నారట. ఎన్నికల్లో మా కన్నీళ్ళు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల కన్నీళ్ళు చూసి భయపడాల్సిన అవసరం ఉంది. ప్రజల కన్నీళ్ళలో కాంగ్రెస్‌ పార్టీ కొట్టుకుపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రిగారు గమనించాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల్లో దగ్గర దగ్గర 25 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఈ రోజు వారంతా రోడ్డున పడ్డారు. ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారాయన. 30 లక్షల ఉద్యోగాలిస్తానని, 15 లక్షల ఉద్యోగాలిస్తానని, వేల కోట్ల పరిశ్రమలు తీసుకువస్తానని కిరణ్‌ కుమార్‌రెడ్డి చెబుతున్నారు. మరి పరిశ్రమలు ఎక్కడున్నాయ్‌... ఉద్యోగాలెక్కడున్నాయని అడుగుతున్నాను. ఏం సాధించారని పైలాన్‌ ఆవిష్కరించారో సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికే తెలియాలి? చంద్రబాబు నాయుడుగారంటే ఆయన పాదయాత్ర బాగా చేశానని చెప్పి పైలాన్‌లు వేసుకుంటూ పోతున్నారు. ఆయన మాదిరిగా పైలాన్‌లు వేసుకోవడం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రారంభించినట్లు ఉన్నారు. ఎందుకంటే.. చంద్రబాబే కదా కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్య సలహాదారు!'

'అన్ని విపక్షాలూ చిన్నచిన్న పార్టీలు సహా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుగారు నిస్సిగ్గుగా విప్‌ జారీచేసి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అసెంబ్లీలో మేం కరెంటు గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. మొన్న అవిశ్వాసం పెట్టినప్పుడు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు వచ్చి ఉండి ఉంటే ప్రభుత్వం భయపడి ఉండేది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చర్చించినప్పుడు ప్రభుత్వానికి భయం ఉంటుంది. అసలైన ప్రధాన ప్రతిపక్షం చర్చించకుండా పోవడం.. మరో పక్కన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడే మద్దతు ఇవ్వడం వల్లనే కరెంట్‌ చార్జీలు, పన్నులు, ఇతర చార్జీలు పెంచడానికి ఈ ప్రభుత్వానికి ధైర్యం వచ్చింది. తమ ఎమ్మెల్యేలకు నిస్సిగ్గుగా‌ విప్ జారీ చేయడమే కాక, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో చంద్రబాబు స్వయంగా అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదంటూ చంద్రబాబు బయట పదేపదే చెబుతున్నారు. బయట ఒక మాట... లోపల ఒక మాట. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు చంద్రబాబు నాయుడుగారు. అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు.'

'అంతకు ముందు చంద్రబాబు నాయుడు రైతుల కోసం అవిశ్వాసం పెట్టినప్పుడు.. పదవులు పోతాయని తెలిసి కూడా మాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలందరూ ఆ రోజున బయటకు వచ్చారు. మొన్నటి అవిశ్వాస తీర్మాన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొమ్మిది మంది మాకు మద్దతుగా వచ్చారు. దీన్ని రెఫరెండంగా తీసుకోండి.. ప్రజల మధ్యకు వెళదాం. ఈ రోజు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని సిఎం కిరణ్ చెబుతున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నేనూ అడుగుతున్నాను. ‌వాళ్ళను డిస్‌ క్వాలిఫై చేసి, చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు రండి అని మీడియా ద్వారా నేను సవాల్‌ చేస్తున్నాను. రేపో, ఎల్లుండో మేమంతా కూర్చొని పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించి, ప్రకటిస్తాం. ఆ కార్యాచరణను ప్రజల మధ్యకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది. మేం చేపట్టిన దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.'
Back to Top