'ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం‌'

అంబాజీపేట (తూర్పు గోదావరి జిల్లా), 19 నవంబర్‌ 2012: రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో మన రాష్ట్రంలో వచ్చినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు కాలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే వైయస్‌ హయాంలోని అన్ని పథకాలు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని 500 మంది టిడిపి కార్యకర్తలు సోమవారంనాడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సిపిలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడారు.

కాంగ్రెస్, ‌టిడిపిల కుట్రలు ఎంతోకాలం సాగబోవని సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి పాలనలో దాదాపుగా పేదల అభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలు నిర్వహించారన్నారు.  ప్రజలకు అవసరమైన ప్రధాన కార్యక్రమాలెన్నింటినో ఆయన రూపొందించి, అమలు చేశారని కొనియాడారు. పేదల అభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమం.. పేదల విద్యాభివృద్ధి కోసం, వారి ఆరోగ్యానికి, వృద్ధులకు ఆదరణ లాంటి కార్యక్రమాలను అమలు చేసింది ఒక్క వైయస్‌ తప్ప మరెవరూ లేరని సుభాష్‌ చంద్రబోస్ గుర్తు ‌చేశారు.
Back to Top