'ప్రజాభిమానం ముందు కుట్రలు దిగదుడుపు'

సత్తెనపల్లి:

రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రలు పన్ని సీబీఐ సాయంతో వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని జైలులో పెట్టించాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శ్రీ జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ పట్టణంలో 'జగన్‌కోసం జన సంతకం' సేకరణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. తాలూకా సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరానికి వికలాంగులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. శ్రీ జగన్‌ను అరెస్టు చేసి 210 రోజులు దాటిందన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకోవడం వల్లే ఆయన్ను జైలు నుంచి బయటకు రానీయకుండా చేస్తున్నాయన్నారు. తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందన్న భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సాహసం చేయడం లేదన్నారు. తొలుత దివంగత మహానేత  డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Back to Top