ఖమ్మం, 8 నవంబర్ 2012: రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులను ఆదుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. రైతు లేనిదే మనం లేమని, అన్నదాత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ఇటీవల నీలం తుపాను సృష్టించిన బీభత్సం కారణంగా ఖమ్మం జిల్లాలో ఏర్పడిన పంట నష్టాన్ని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె ముందుగా జిల్లాలోని తిరుమలాయపాలెంలో పంట పొలాలను పరిశీలించారు. అనంతరం విజయమ్మ బాధిత రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి, మిర్చి పంటలకు న్యాయమైన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. పంట నష్టంపై కేంద్రం సర్వే చేస్తుందని అధికారులు చెబుతున్నారని, అయితే, సర్వేలు చేసే లోగానే నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంట నష్టం పరిహారంపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ పత్తి, మిర్చి పంటలు వేసి, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు. విజయమ్మ పర్యటన పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. పత్తి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న, వరి పంటలకు జరిగిన పంట నష్టాన్ని ఆమె పరిశీలించారు. పంట దెబ్బతిన్న రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 2,31,966 ఎకరాల్లో పత్తిపంట తీవ్రంగా నష్టపోయింది. నీలం తుపాను కారణంగా తూర్పు గోదావరి జిల్లా తరువాత అత్యధికంగా నష్టపోయిన జిల్లాగా ఖమ్మం ఉందని అధికారికి లెక్కలు చెబుతున్నాయి.
అంతకు ముందు విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విజయమ్మకు ఘనంగా స్వాగతం పలికారు. నీలం తుపాను వల్ల ముంచుకువచ్చిన వరదలతో నష్టపోయిన పంటలను ఆమె పరిశీలిస్తున్నారు. బాధిత రైతులతో విజయమ్మ ముఖాముఖి మాట్లాడారు. ఐదు నియోజకవర్గాల్లో పర్యటన ముగించుకుని తిరిగి రోడ్డు మార్గంలో ఆమె ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు విజయమ్మ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. విజయమ్మ పర్యటనలో ఆమెతో పాటు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు మదన్‌లాల్ నాయక్, పార్టీ జిల్లా పరిశీలకుడు గుణ్ణం నాగిరెడ్డి, రాష్ట్ర స్థాయి నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు, పార్టీ నాయకురాలు విజయారెడ్డి కూడా ఉన్నారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 303 రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల మరమ్మతులకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు.