ప్రభుత్వం చెప్పేదొకటి...చేసేదొకటి: వైయస్ఆర్ సీపీ

షాద్‌నగర్: తెలంగాణ సమస్యపై రాష్ట్రప్రభుత్వ వైఖరి చెప్పేదొకటి...చేసేదొకటి అన్నచందంగా ఉందని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా పరిశీలకులు బండారు మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మార్చ్ కార్యక్రమానికి అనుమతినిచ్చినట్లే ఇచ్చిన ప్రభుత్వం పోలీసులచేత విద్యార్థులు, ఉద్యమకారులపై అక్రమ నిర్భంధాలు, దాడులకు పాల్పడటం దారుణమన్నారు. తెలంగాణ ప్రజల చేతిలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ అంశంపై వైయస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరితోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వై.యస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్లీనరీలోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోకి ఎఫ్‌డిఐల అనుమతి, గ్యాస్, డీ జిల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తాము నిరంతర పోరాటం చేస్తామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి సాగునీరు అందివ్వాలన్నారు. లేని పోంలో వచ్చే వేసవిలో ఆందోళన చేపడతామన్నారు.  పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు శక్తివంచన లేకుండా కృషిచేయాలని మోహన్‌రెడ్డి సూచించారు ప్రస్తుతం గ్రామానికి కనీసం 25మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్చుకోవాలన్నారు. అక్టోబర్ నెలాఖరులోగా అన్ని మండలాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తిచేసి వచ్చేనెలలో జరిగే ప్లీనరీకి సిద్ధం కావాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ నాయకులు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, డాక్టర్ శివరాంనాయక్, శేఖర్‌పంతులు, సుజీవన్, ఏ.ఆర్.ఖాన్, జి.వెంకటయ్య, దామోదర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

Back to Top