పోలీసుల తీరుకు విజయమ్మ నిరసన

హైదరాబాద్, 07 జూన్ 2013:

హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం ఉదయం కోర్టుకు తీసుకొచ్చినపుడు పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను  అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పరిస్థితి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇంత నిర్బంధం అవసరమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మరోవైపు పోలీసుల వైఖరి పట్ల న్యాయవాదులు కూడా నిరసన తెలిపారు.

కోర్టులోకి అనుమతించకపోవడం దారుణం: భారతి
శ్రీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులమైన తమను కుటుంబ సభ్యులను కోర్టులోకి అనుమతించకపోవడం దారుణమని శ్రీ జగన్ సతీమణి శ్రీమతి భారతి ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు హాజరు పరచనున్న నేపథ్యంలో ఆయన్ని చూసేందుకు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి భారతి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టులోకి వెళ్ళకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని శ్రీమతి  భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితిని సులభంగా ఊహించుకోవచ్చన్నారు.

కుటుంబంతో మాట్లాడేందుకు జగన్కు అనుమతి
కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు సీబీఐ న్యాయస్థానం శ్రీ జగన్మోహన్ రెడ్డిని అనుమతిచింది. గంటపాటు ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని సూచించింది. దీంతో ఆయన కోర్టు ఆవరణలో తల్లి  శ్రీమతి విజయమ్మ, భార్య శ్రీమతి భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అంతకు ముందు శ్రీమతి  విజయమ్మ ... శ్రీ జగన్మోహన్ రెడ్డిని చూసి కంటతడి పెట్టారు. కోర్టు హాలులో ఆయనను విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు. శ్రీ జగన్ తల్లిని అనునయించారు. మీడియా ప్రతినిధులను కూడా ఆయన పలుకరించారు.
విజయారెడ్డి అరెస్టు: శ్రీ  వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు హాజరు పరచనున్న నేపథ్యంలో నాంపల్లిలోని  హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పార్టీ నేత విజయా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.

Back to Top