పోలవరం పనులు ఆపడం కుట్ర: కొణతాల

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

పోలవరం ప్రాజెక్టు పనులు ఆపడం ఓ కుట్రని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్సులోని 'కరెంటు సత్యాగ్రహం' దీక్షా ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు తుది రూపం తేవడానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారని చెప్పారు. ఒడిశాలో బిజు జనతాదళ్ మద్దతు కోసం యూపీఏ మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టిందని విమర్శించారు. కొందరు దుష్టశక్తులతో కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాలరాశారన్నారు. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు మాదిరిగానే కిరణ్‌ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అభిప్రాయాలను తెలుసుకొని, పార్టీ పెద్దలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కొణతాల వివరించారు.

Back to Top