ముడుపుల కోసమే పోలవరం

వెలగపూడి: కేంద్రం ఇచ్చే ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం ప్రభుత్వం లాక్కుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. టీడీపీ కాంట్రాక్టర్‌లకు లబ్ది చేకూర్చడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోలవరానికి జాతీయ హోదా రాకమునుపే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.  సెక్షన్‌ 90లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టును కడతామంటూ చంద్రబాబు ప్రభుత్వం బిల్డప్‌ ఇస్తుందని ఎద్దేవా చేశారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ పోలవరం కోసం రూ. 5,559 కోట్లు ఖర్చు చేసి రైట్‌ కెనాల్‌ 174 కిలోమీటర్లు ఉంటే 144 కిలోమీటర్లు, లెఫ్ట్‌ కెనాల్‌ 182 కిలోమీటర్లు ఉంటే 135 కిలోమీటర్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ. 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలవరానికి కేంద్రం ఎంత నిధులిచ్చిందని ప్రశ్నిస్తే ప్రతిపక్షనేత మైక్‌ కట్‌ చేస్తూ అధికార పార్టీ వంకర సమాధానాలు చెబుతోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రాజెక్టు అంచెనాలను రూ. 40 వేల కోట్లకు సవరిస్తే కేంద్రం మాత్రం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఇస్తానని స్పష్టం చేసిందన్నారు. రూ. 4 వేల కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్‌ ప్రతిపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షాన్ని వెనకేసుకురావడం ఎంత వరకు సమంసజం అని నిలదీశారు. చంద్రబాబు సర్కార్‌ ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వం సిగ్గుపడాలి
వెలగపూడి: విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు హామీని సాధించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కేవలం కమీషన్ల కోసం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులెంతా.. నిర్మాణ ఖర్చు ఎంతా అని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టును సాధించడానికి బదులు కేంద్రానికి ఒత్తాసుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకమునుపే రూ. 5,559 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక మూడు సంవత్సరాల్లో రూ. 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కు మాత్రమే ఖర్చు పెడతామని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై పంపించిన నివేదికను కేంద్రం పరిగణలోకి కూడా తీసుకోలేదన్నారు. కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం అంగీకరించిందన్నారు. దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. 


Back to Top