నిజాలను వక్రీకరిస్తున్న దిగ్విజయ్, షిండే

న్యూఢిల్లీ, 10 అక్టోబర్ 2013:

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ‌నాయకులు దిగ్విజయ్‌సింగ్, సుశీ‌ల్ కుమా‌ర్ షిండే‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో నిజాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇతర పార్టీలు కేంద్రానికి పంపిన తీర్మానాల్లోని ఎంపిక చేసిన అంశాలను మాత్రమే ప్రకటిస్తూ.. బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్రకు జాతీయ స్థాయి నాయకుల నుంచి మద్దతు కూడగట్టేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీ వచ్చిన పార్టీ నాయకులు గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణాకు అనుకూలమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని మైసూరా, మేకపాటి, ఉమ్మారెడ్డి తెలిపారు. కేంద్రానికి పార్టీ ఇచ్చిన లేఖలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని ప్రస్తావించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కూడా‌ రెండవ ఎస్పార్సీ గురించి మాత్రమే చెప్పారని వారు గుర్తుచేశారు.‌ కేంద్ర మంత్రివర్గ బృందం (జిఒఎం)లో ఉన్న ‌వారంతా కాంగ్రెస్ కో‌ర్ కమిటీలోని వారేనని వారు చెప్పారు. మంత్రుల కమిటీ న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ఈ జిఒఎం పారదర్శకతపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదన్నారు. మంత్రుల బృందంలో ఉన్నవారెవరూ తటస్థంగా వ్యవహరించే వారు కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించే వారే అన్నారు. అందువల్ల మంత్రుల బృందంలోని వారు ఇరు ప్రాంతాలకూ ఎలా న్యాయం చేయగలరని ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో మొన్న ఢిల్లీ వచ్చిన తమ పార్టీ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోనూ, ఢిల్లీలో అందుబాటులో ఉన్న సిపిఎం, డిఎంకె, సిపిఐ, బిజెపి నాయకులతో భేటి అయ్యామని మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను యధాతథంగా ఉంచడంలో కలిసిరావాలని విజ్ఞప్తిచేశామన్నారు. ఆయా పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్లను సంప్రతించకుండా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవడం సరికాదని వారంతా ఒకేలా స్పందించారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి సిపిఎం మద్దతు పలికిందన్నారు. అభిప్రాయాలు వేరుగా ఉన్నా ఇరు ప్రాంతాలకు న్యాయం కోసం పోరాడతామని సిపిఐ, బిజెపి నాయకులు చెప్పారన్నారు. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని డిఎంకె చెప్పిందన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు కూడా నిరసన వ్యక్తంచేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల చివరికి ముఖ్యమంత్రి కూడా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సానుకూలమైనది కాదని అన్నారు. కేంద్రం నిర్ణయంలో ఏమాత్రం న్యాయం లేదు కనుకే కాంగ్రెస్‌ పార్టీ నాయకుల నుంచి కూడా దానికి మద్దతు లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విభజించాలన్నది తెలివైన నిర్ణయం కాదని, పునరాలోచించి దానిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ ఫోబియా‌ పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైఖరి సమైక్యమా లేక తెలంగాణాకు అనుకూలమా ముందుగా స్పష్టం చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

Back to Top