జననేతకు మద్దతుగా కదంతొక్కిన ప్రజానీకం

కర్నూలుః  తెలంగాణలో నిర్మించనున్న అక్రమ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో పడకేసిన టీడీపీ పాలనను నిద్రలేపేందుకు ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్న జలపోరాటం కొనసాగుతోంది. జనం కోసం జలం కోసం జననేత చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు  కర్నూలు దీక్షాస్థలికి చేరుకుంటున్నారు. వైయస్ జగన్ పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజానీకంతో వైయస్ జగన్ కరచాలనం చేస్తూ, ఆత్మీయంగా నమస్కరిస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. వైయస్సార్సీపీ  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు దీక్ష వేదిక వద్ద వైయస్ జగన్ను పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వేదికపై పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా  బాబు నోరుమెదకపోవడంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని, ఏపీ ప్రభుత్వం చేతగానితనాన్ని దుయ్యబట్టారు.వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించుకునేందుకు అందరూ నడుంబిగిస్తున్నారు. జననేతకు అండగా పోరాడుతామని నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్న చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో  కేంద్రంతో, కేసీఆర్ తో లాలూచీ పడి చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. అక్రమ కట్టడాలను అడ్డుకోకపోతే చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.  Back to Top