పటాన్‌చెరు బహిరంగ సభకు భారీ సన్నాహాలు

పటాన్‌చెరు:

మెదక్ జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు గూడెం మహీపాల్‌రెడ్డి గురువారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం కూడా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో చేరతారు. ఇందుకోసం పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. శ్రీమతి వైయస్ విజయమ్మ రాకను పురస్కరించుకొని గూడెం మహీపాల్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. మూడు హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి పూలవర్షం కురిపించనున్నారు. ఇందుకోసం వెయ్యి కిలోల పూలను  తెప్పించారు. శ్రీమతి విజయమ్మ మధ్యాహ్నం 3 గంటలకు లింగంపల్లి చౌరస్తాకు చేరుకుంటారు. జిల్లా నేతలు అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి పటాన్‌చెరు వరకు విజయమ్మను ఓపెన్‌టాప్ జీపులో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఊరేగింపులో 20 గుర్రాలు, మూడు వేల బైక్‌లు, 500 ఆటోలు, కార్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. 400 డప్పులు, లంబాడీ నృత్యాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారులు ఆట పాటలతో అలరించనున్నారు. విజయమ్మ పటాన్‌చెరుకు చేరుకోగానే బస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సభాప్రాంగణానికి చేరుకుంటారు.
      పటాన్‌చెరు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన వైయస్ఆర్ కాంగ్రెస్ జెండాలు ఏర్పాటు చేశారు. మైత్రి మైదానంలో జరిగే బహిరంగ సభకు ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణను పార్టీ గ్రామస్థాయి నాయకులు బాధ్యతలు తీసుకున్నారు. పటాన్‌చెరు నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు జాతీయ రహదారిపై ఎటు చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలే కన్పిస్తున్నాయి.
     పటాన్‌చెరు బహిరంగ సభకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రుద్రారం, భానూరు వైపు నుంచి వచ్చేవారు ర్యాల్‌కమ్ పరిశ్రమ ఆవరణలో, జిన్నారం వైపు నుంచి వచ్చే వారు చిన్నవాగు శివారులో మహీపాల్‌రెడ్డి ఫంక్షన్‌హాలు ఆవరణలో వాహనాలను పార్కు చేయాల్సి ఉంటుంది. రామచంద్రాపురం వైపు నుంచి వచ్చే వారు మైత్రి మైదానం పక్కనే ఉన్న ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు 30 వేల మందికిపైగా వైఎస్ అభిమానులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. పటాన్‌చెరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Back to Top