విభజన గొడ్డలికి ఎదురు నిలిచింది వైయస్సే

కాకినాడ, 14 సెప్టెంబర్ 2013:

విభజన అనే గొడ్డలికి ఎదురు నిలిచి రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడింది వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరు మాత్రమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ రాజశేఖరరెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి 'పని తక్కువ.. ప్రచారం ఎక్కువ' అని ఆమె ఎద్దేవా చేశారు. సత్తా లేని సిఎం కిరణ్ కనుకే మన రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టిందని దుయ్యబట్టారు. పదవి వదులుకోవడం అంటే కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రాణాలు వదిలేసుకున్నంత ‌కష్టం అన్నారు. జీతాలు, జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఎపి ఎన్జీవోలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత జీతాలు ఇవ్వడమే కాకుండా వారిని గౌరవిస్తూ ఒక నెల జీతాన్ని బోనస్‌గా కూడా ఇస్తారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల మాట ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ సూచనలను పక్కన పెట్టి... రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజించాల‌నుకుంటుందో చెప్పాలని ‌ఆమె ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీమతి షర్మిల శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మసీదు సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

రాష్ట్రానికి మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలను ఆయన మనస్ఫూర్గిగా ప్రేమించారు గనుకే అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉండేలా చూశారన్నారు. రైతులను అయితే వైయస్ఆర్‌ గుండెల్లో పెట్టుకుని చేసుకున్నారన్నారు. విద్యార్థులు, నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరికీ మేళ్ళు చేశారన్నారు. ముస్లిం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజశేఖరరెడ్డిగారు చాలా ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో కూడా పోరాడి వారికి 4 శాతం రిజర్వేషన్‌ ఇప్పించిన ఘనత మహానేత వైయస్ఆర్‌దే అని తాము గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. వైయస్ఆర్ ‌బ్రతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ప్రధానమంత్రి సహా కోట్ల మంది అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు.

అసలు అన్యాయం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి వైయస్ రాజశేఖరరెడ్డి... రోశయ్య కమిటీ వేశారని, 2009లో ‌టిఆర్‌ఎస్, టిడిపి పొత్తు కుదుర్చుకున్నా నాలుగు పార్టీలు కలిసి.. ఏకధాటిగా యుద్ధం చేసినా వైయస్ఆర్‌ ఒకే ఒక్కడిగా నిలబడి ఒంటి చేత్తో పోరాటం చేసి ఆ ఎన్నికల్లో గెలిచారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి తప్ప ప్రత్యేక రాష్ట్రం కాదని ఆ మహానేత నిరూపించారని అన్నారు. వైయస్ఆర్ లాంటి సత్తా ఉన్న ‌సిఎం లేనందువల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మన దురదృష్టం కొద్దీ రాజశేఖరరెడ్డిగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయారని విచారం వ్యక్తంచేశారు.

ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అని శ్రీమతి షర్మిల నిప్పలు చెరిగారు. వైయస్ఆర్‌ రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న ఈ ప్రభుత్వం ఆయన పథకాలన్నింటికీ తూట్లు పొడిచిందని, ఆయన ప్రతి ఉద్దేశాన్నీ విమర్శిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపాలు సరిపోలేదన్నట్లు ఇప్పుడు ఒక తల్లి బిడ్డలైన తెలంగాణ, సీమాంధ్రుల మధ్య విభజన చిచ్చుపెట్టి చలి కాచుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పై రాష్ట్రాల అవసరాలు తీరితేనే గాని కృష్ణా, గోదావరి నదుల నీళ్ళు దిగువన ఉన్న మనకు రాని దుస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వచ్చి నీటిని అడ్డుకుంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు నీళ్ళు రాక ఎండిపోతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటున్న కేంద్రం దాన్ని ఏ నీళ్ళతో నింపుతుందో చెప్పడంలేదన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా మంచినీరు లేదన్నారు. కృష్ణా, గోదావరి నీళ్ళను అడ్డుకుంటే సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారి అయిపోదా? అని ప్రశ్నించారు.

అరవై ఏళ్ళ పాటు కలిసి కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భాగం లేదనడంలో న్యాయం ఎక్కడుందని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఉద్యోగాలు, పరిశ్రమలు, అత్యధిక ఆదాయం అంతా హైదరాబాద్‌లోనే ఉంటే, ఇప్పుడది మనది కాదంటే ఉపాధి కోసం సీమాంధ్రులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. కేవలం పదేళ్ళలో హైదరాబాద్‌ లాంటి రాజధానిని కట్టుకోవడం సీమాంధ్రలో సాధ్యపడుతుంది? అన్నారు. హైదరాబాద్‌ ఆదాయంతో సీమాంధ్రులకు సంబంధం లేదని ఆపేస్తే.. జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఏ విధంగా నిర్వహించాలన్నారు.

విభజన విషయంలో శ్రీకృష్ణ కమిటి ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. నిపుణులతో కూడిన శ్రీకృష్ణ కమిటీ దాదాపు ఏడాది పాటు కూలంకుషంగా అధ్యయనం చేసిన తరువాత రాష్ట్రాన్ని విభజించడం మంచిది కాదు.. సమైక్యంగా ఉంచితేనే అన్నింటికన్నా మంచిదని చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఆ కమిటీ సూచనను పక్కన పెట్టి మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు విభజించాలనుకుంటోందని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని విభజిస్తే ఎవరికి లాభం..? తెలుగుజాతి ఒక్కటిగా ఉంటే ఎవరికి నష్టం..? తెలుగుగడ్డ మీద వైయస్ఆర్ లాంటి ‌సిఎం ఆవిర్భవిస్తే తట్టుకోలేని బలహీనత ఎవరికి ఉంది..? అంటూ శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. మంచి పనుల ద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకునే సత్తా.. కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే..‌ ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. చెడు చేసైనా వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుందన్నారు.

రాజశేఖరరెడ్డిగారు అసెంబ్లీ స్పీకర్‌గా చేయకపోతే.. సోనియా గాంధీ కంటికి కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపించి ఉండేవారే కాదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా అయ్యుండేవారే కాదన్నారు. కానీ ఆ కృతజ్ఞత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. కరెంటు చార్జీల పేరుతో రూ. 32 వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజల నెత్తిన కిరణ్‌కుమార్‌రెడ్డి మోపి, వారి రక్తం పిండి మరీ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని పన్నులు, చార్జీలు పెంచేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చేస్తున్నట్లు ముందే తెలిసినా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. అడ్డుచెబితే తన పదవి ఊడిపోతుందని కిరణ్‌ భయపడ్డారన్నారు. కోట్లాది మందికి అన్యాయం జరుగుతుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలా నిలిచి, ఏమీ చేతగాని వాడిలా వ్యవహరించారని తూర్పారపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉంటే.. దిగ్విజయ్‌ సింగ్‌ విభజన ప్రకటన చేసిన రోజు జూలై 30నే నిలిచిపోయి ఉండేదన్నారు. అనుకోకుండా వచ్చిన పదవి కాబట్టే వదులుకోవాలంటే కిరణ్‌కు ప్రాణం వదిలినంత కష్టం అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట చెప్పే కిరణ్‌రెడ్డి గారడి చేస్తారని కాంగ్రెస్‌ వాళ్ళే చెబుతారన్నారు.

కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిలో ఎలాంటి చలనమూ లేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేయండి అని బ్లాంక్‌ చెక్కులాగా లేఖ ఇచ్చిందే చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన చేయండి అంటూ.. 18 అక్టోబర్‌, 2008న కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను శ్రీమతి షర్మిల చదివి వినిపించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను సమైక్య వాదులకు చూపించారు. హత్యచేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చిన చందంగా చంద్రబాబు బస్సు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే.. ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారం లాగేసుకుని ఇప్పుడు ఆ పార్టీని 'తెలుగు ద్రోహుల పార్టీ'గా మార్చేశారని విమర్శించారు. హైదరాబాద్‌ను రూ.4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టేసిన ద్రోహి, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని నిప్పులు చెరిగారు.

చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన వల్ల కోట్లాది మందికి అన్యాయం జరిగిపోయిందని, చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు. విభజనకు తాను కూడా వ్యతిరేకమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం పార్టీల పక్షాన నాలుగవ పార్టీగా నిలబడాలని అన్నారు. సీమాంధ్రులకు జరుగుతున్నఅన్యాయానికి నిరసనగా చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. అంతవరకూ చంద్రబాబును సీమాంధ్రలో అడుగుపెట్టవద్దని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పే చంద్రబాబులో మానవ రక్తం ప్రవహించడం లేదనుకోవాలా? అన్నారు.

మా ఓట్లు దండుకుని.. మా కళ్ళే పొడుస్తారా.. మా బ్రతుకులే బుగ్గిపాలు చేస్తారా అని కోట్లాది మంది సీమాంధ్రులు కాంగ్రెస్‌, టిడిపిలను నిలదీస్తున్నారని శ్రీమతి షర్మిల అన్నారు. తెలుగుతల్లి శోకం పెడుతున్నా ఈ కాంగ్రెస్‌ పార్టీకి వినిపించడం లేదన్నారు. తమ తమ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేసి కోట్లాది మంది రోడ్ల మీదకు ఇచ్చి ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్‌ పార్టీకి కనిపించడం లేదని దుయ్యబట్టారు.

Party activists attended to Smt. Sharmila`s public meeting in Kakinada ఎపి ఎన్జీవోలు, వారి కుటుంబ సభ్యులు ఊరి ఊరిలోనూ సమైక్య ఉద్యమాలు చేస్తున్న వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‌ఎపి ఎన్జీవోలను వేధించడంపై మండిపడ్డారు. వారికి జీతాలు కూడా ఇవ్వనంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. జీతాలు లేక ఇల్లు, పిల్లలకు ఎంత ఇబ్బందిగా ఉన్నా ఎపి ఎన్జీవోల ఉద్యమ స్ఫూర్తి ఏమాత్రం చెక్కుచెదరలేదని ప్రశంసించారు. వారి ఉద్యమ స్ఫూర్తిని, త్యాగాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందన్నారు. సమైక్య ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క ఎన్జీవోకూ జీతాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. మరికొన్ని నెలల్లోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావండ ఖాయం అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కావడం కూడా తథ్యం అన్నారు. ఎన్జీవోల కుటుంబాలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి న్యాయం చేయదని తేలిపోయింది కనుక సమైక్యంగానే ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డిగారు చేతులు కట్టుకుని కూర్చోరని అన్నారు. జనం తరఫున జగనన్న నేతృత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందాకైనా పోరాటం చేస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. జనంలో ఉన్నా జైలులో ఉన్నా జగనన్న జననేతే అని గర్వంగా చెప్పారు. బయటే ఉన్నా కాంగ్రెస్, టిడిపి నాయకుల దొంగలే, ద్రోహులే అని అభివర్ణించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చేతకాదు కనుకే కుట్రలు చేసి జగనన్నను జైలులో పెట్టారన్నారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని, జగనన్ననూ ఎవరూ ఆపలేరు.. ఆపడం కాంగ్రెస్, టిడిపి నాయకుల తరం కాదన్నారు. త్వరలోనే జగనన్న వస్తారు.. మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారన్నారు. అప్పటి వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top