తీర్మానం చేసి ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు

విభజన చట్టంలోని హామీలు..
రాష్ట్ర ప్రజల హక్కు
తీర్మానంతో చేతులు దులుపుకోవడం కాదు
హామీల కోసం బాబు చిత్తశుద్ధితో కృషిచేయాలి

హైదరాబాద్ః ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలోని హామీలపై తీర్మానం చేసి ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి చురక అంటించారు. రాష్ట్ర ప్రజలు తీర్మానాన్ని కోరుకోవడం లేదని..పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను హక్కుగా భావిస్తున్నారన్నారు. అది మీరు వేసే బిక్ష కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీర్మానం చేసి ఉంటే బాగుండేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు . రాబోయే కాలంలో కేంద్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దేనికైనా సిద్ధమని చంద్రబాబు సభలో ప్రకటించకపోవడం దారుణమన్నారు. 

చంద్రబాబు తీర్మానంతో చేతులు దులుపుకుంటామంటే కుదరదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, రాజధాని నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను చంద్రబాబు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. కాలపరిమితితో కేంద్రానికి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని తప్పుపట్టారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Back to Top