<strong>అందుకే రైతుకు రుణసాయం తగ్గుముఖం</strong><br/><br/>వ్యవసాయమంటే దండగన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి నిశ్చితాభిప్రాయం. దండగమారి పని కాబట్టి వ్యవసాయానికి ఆయన ఎలాంటి ప్రోత్సాహమూ ఇవ్వరు. పైకి ఎన్ని చెప్పినా ఆ రంగాన్ని దారుణంగా దెబ్బతీయడమే ఆయన లక్ష్యం. ఆయన ప్రతి చర్యా ఇందుకు ప్రబల నిదర్శనం. రుణమాఫీ చేస్తానని నమ్మకంగా వాగ్దానం చేసిన చంద్రబాబు ఆనక రైతులకు ఎలా చేయిచ్చాడో చూశాం. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీలు పెరిగి తడిసిమోపెడయి చివరకు బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు పుట్టని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు సకాలానికి అందిస్తేనే రైతులు వ్యవసాయాన్ని ముందుకు నడిపే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నిర్వాకం కారణంగా ఈ ఏడాది రాష్ర్ట రైతులకు చాలినన్ని రుణాలు అందని పరిస్థితి నెలకొంది. రైతులకు ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యం ఏటా పెరుగుతూ రావడం పరిపాటి. ఆమేరకు రైతులకు ప్రయోజనం జరుగుతుంది. గత రెండేళ్లలో ఏటా సుమారు రు.10 వేల కోట్ల చొప్పున రైతులకు రుణాలు అదనంగా మంజూరయ్యాయి. 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలలో లక్ష్యాలకు మించి రుణాలు మంజూరయ్యా. 2012-13లో రుణాల లక్ష్యం 35,654 కోట్లు కాగా ఏకంగా రు.50,060 కోట్లు రుణాలు ఇచ్చారు. 2013-14లోనూ లక్ష్యానికి సుమారు రు.3వేల కోట్లు అధికంగానే రుణాలు మంజూరయ్యాయి. కానీ ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా బ్యాంకులు ఇచ్చే రుణాల లక్ష్యం తగ్గిపోయింది. రుణమాఫీ పేరుతో కనీసం వడ్డీలకు సరిపడా డబ్బులు కూడా ఇవ్వకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టడం వల్ల రుణాల లక్ష్యం ఈసారి దాదాపు రు.2వేల కోట్లు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీలో రైతులకు రు.56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రు.53,925 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. రుణమాఫీ జరక్కపోవడం, ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధించడం, పాతరుణాలను రైతులు తిరిగి చెల్లించలేకపోవడం మూలంగా గతేడాది బ్యాంకులు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయకుండా భారీగా కోతవిధించాయి. గతేడాది ఖరీఫ్ రబీలో ఏకంగా రు.16 వేల కోట్ల మేర తక్కువగా రైతులకు రుణాలు అందాయి. అంటే ఆ మేరకు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారన్నమాట. రైతుల పరిస్థితే ఇలా ఉంటే ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దిగజారింది. గతంలో లక్షల సంఖ్యలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. అయితే గతేడాది కేవలం 36,543 మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి 63.36 కోట్ల రుణాలే అందాయి.