నిరుపేదల ఆర్తికి స్పందిస్తోన్న మానవతామూర్తి...

అనంతపురం 26 అక్టోబర్ 2012 : పాదయాత్రలో షర్మిల ప్రజల కష్టాలతో మమేకమౌతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాలను నిలదీయటంతో పాటు వారిని ఓదార్చుతున్నారు. అంతమాత్రమే కాదు, ఎవరైనా కష్టం చెప్పుకుంటే స్పందించి అప్పటికప్పుడు సాయమూ అందిస్తున్నారు. తండ్రి వైయస్ ఎలాగైతే స్పందించేవారో అచ్చం అలాగే షర్మిల కూడా జనం కష్టాలకు చలించిపోతున్నారు. అన్న అడుగుజాడలలో నడుస్తున్న ఆమెలోని మానవాతాకోణం ఇది.
పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా చిల్లకొండాయపల్లి వద్దకు వచ్చిన బత్తలపల్లికి చెందిన నిరుపేద మహిళ లక్ష్మీదేవి తన భర్త నర్సింహకు కిడ్నీ పాడైపోయిందనీ,
ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని వైద్యులు చెప్పారని, అయితే కూలిపని చేసుకుని బతికే తమకు
ఆపరేషన్ చేయించే స్థోమత లేదని విలపించడంతో షర్మిల చలించిపోయారు.
అప్పటికప్పుడే వివరాలు తీసుకుని ఆపరేషన్ చేయించే బాధ్యత తనదీ అని హామీ
ఇచ్చి,  హైదరాబాద్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అక్కడికెళ్లాలని
లక్ష్మీదేవికి దారి ఖర్చులు కూడా ఇచ్చారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని,
అధైర్యపడొద్దని ఆమెను ఓదార్చారు.
చిల్లకొండాయపల్లి సమీపంలో పాదయాత్ర సాగుతుండగా, కదిరి నుంచి వికలాంగులు వచ్చి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రెండు కళ్లూ లేక 80 ఏళ్ల వయసులో ఉన్న తనకు పెన్షన్ ఇవ్వలేదని, వయసుందని అంటున్నారని ఓ వృద్ధురాలు షర్మిలతో మొరపెట్టుకున్నారు. ‘ఈ పండుటాకుకు పెన్షన్ ఇవ్వలేరా? ఈ ప్రభుత్వం గుడ్డిదా? ఈమెకు ఇంకా వయసుందా?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షన్ లేదని, తిండి లేదని,  వైఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్‌ను రద్దు చేశారని మరికొందరు వాపోయారు. రెండు కాళ్లూ లేని వికలాంగులు కూడా అక్కడికి తరలిరావడంతో షర్మిల చలించిపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న సీఎం అయ్యాక పెన్షన్ లభిస్తుందని వారిని ఆమె ఓదార్చారు. అలాగే తాడిమర్రి మండలం పెద్దకోట్ల సమీపంలో, పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన బి.నాగేశ్వర్ రెడ్డి అనే వికలాంగుడు షర్మిలను కలుసుకుని బీకాం చదివిన తనకు ఎంబిఏ చదవాలని ఉందన్నాడు. అయితే తమకు స్థోమత లేదనీ, ప్రభుత్వం ప్రోత్సాహం కూడా లేదని అతడు వాపోయాడు. స్పందించిన షర్మిల ఎంబిఏ కోర్సు చదవడానికి అయ్యే ఖర్చు తాము భరిస్తామంటూ వాగ్దానం చేశారు.

తాజా వీడియోలు

Back to Top