నిప్పులు చెరుగుతూ.. ఆత్మీయత పంచుతూ..

మరో ప్రజాప్రస్థానం రెండోరోజు షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది ప్రజల కష్టాలు పట్టని సర్కారని చెప్పారు. కరెంటు ఇవ్వడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా అవసరమైన ముందు చూపు  లేదన్నారు. రైతులకు న్యాయం చేయకుండా మొద్దునిద్ర పోతోందని మండిపడ్డారు. కొత్తగా ఒక్క పింఛనూ మంజూరు చేయలేదన్నారు. కష్టాలు తొలగాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలనీ, అది జగనన్నతోనే సాధ్యమనీ స్పష్టంచేశారు. కుమ్మక్కు రాజకీయాలకు నిరసన తెలపాలనీ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా?

కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల మాట్లాడారు. సంభాషణ సారాంశమిదీ..

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?

శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెంఛన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.

షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా?


ఇలా వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైయస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైయస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పింఛను వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు.  వైయస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.

కార్మికులు, వారి కుటుంబాలు ఏం కావాలి?

మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు.

పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైయస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.

మెస్ చార్జీలు రోజుకు రూ. 40 చొప్పున ఇవ్వాలి..

కత్తులూరు పంచాయతీ పరిధిలోని వేంపల్లి మైనారిటీ గర్ల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ‘కరెంటు లేదు. చదవుకోలేకపోతున్నాం. మెస్ చార్జీలు సరిపోవడం లేదు..’ అని వారు ఆందోళన వ్యక్తంచేయగా.. ‘‘మెస్ చార్జీలు రోజుకు రూ. 16.50 ఇస్తున్నారట. సబ్బులు, కాస్మొటిక్స్‌కు నెలకు రూ.50 ఇస్తున్నారట. మిగతావన్నీ దేవుడెరుగు. కనీసం తినడానికి రోజుకు రూ.40 చొప్పున మెస్ చార్జీలు చెల్లించాలని వైయస్ఆర్‌ సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల అన్నారు.
Back to Top