వియ్యంకులిద్దర్ని భర్తరఫ్‌ చేయాలి

  • పేప‌ర్ లీకేజీకి బాబు నైతిక బాధ్యత వహించాలి
  • ఆస్తులు, ఎమ్మెల్సీల మీద ఉన్న ఇంట్రస్టు విద్యార్థుల భవిష్యత్తుపై లేదా
  • పేద విద్యార్థుల తల్లిదండ్రుల కాళ్లుపట్టుకొని క్షమాపణ చెప్పాలి
  • ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్‌
  • విజయవాడ: పదో తరగతి ప‌శ్న‌ప‌త్రం లీకేజీకి ప్రధాన కార‌కులైన‌ వియ్యంకులు, టీడీపీ క్యాబినెట్‌ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను వెంటనే భర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. వియ్యంకులిద్దరూ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా కనీస రాజకీయ అవగాహన లేని నారాయణకు మంత్రి పదవి ఇవ్వడం ఎంత వరకు న్యాయమని చంద్రబాబును ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లోని ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు నీతి, నిజాయితీ, సిగ్గు, మానం ఉంటే పేపర్‌ లీక్‌లపై బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యా శాఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఎన్నో కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం ఆ కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకున్న దాఖళాలు లేవన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందుకు అడుగులు వేశాడా అంటే అది కూడా లేదని స్పష్టం చేశారు. చదువుల తల్లి రిషితేశ్వరి చనిపోయినప్పుడు శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కు వెళ్లాడని, కర్నూలులో విద్యార్థినీ ఆత్మహత్య చేసుకుంటే ఆమెరికాలో విహారయాత్రలు తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. తన ఆస్తులపై బ్యాంక్‌లు నోటీసులు జారీ చేస్తే వాటిని కాపాడుకోవడానికి ఢిల్లీకి వెళ్లి పెద్దవాళ్ల కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడని రోజా విమర్శించారు. 

    దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారు
    నారాయణ కళాశాలలు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పేపర్‌ లీక్‌ అవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు. సాక్షాత్తు చంద్రబాబు సొంత జిల్లాల్లో, విద్యాశాఖామంత్రి గంటా, పురపాలక శాఖామంత్రి నారాయణల సొంత జిల్లాల్లో పేపర్‌లు లీక్‌ అవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవడానికి ఉన్న ఇంట్రస్టు పేద పిల్లల భవిష్యత్తు గురించి విద్యా శాఖమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 6వ తేది నుంచి అసెంబ్లీ స్టార్ట్‌ అయితే గంటా, నారాయణలు ఎన్ని క్వశ్చన్‌లకు సమాధానం చెప్పారు. ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అలాంటి వారికి మంత్రి పదవులు ఎందుకిచ్చారని నిలదీశారు. టీవీల్లో నారాయణ కాలేజ్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ అంటూ ఊదరగొడుతున్నారే పేపర్‌ లీక్‌లతోనే మీకు ఫస్ట్‌ ర్యాంకులు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు, హత్యలు, పేపర్‌ లీక్‌లలో నారాయణే ఫస్ట్‌ ఉన్నాయంటే సిగ్గుచేటు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టుపటించి వియ్యంకుడిని అడ్డుపెట్టుకొని విద్యాశాఖ ద్వారా దోచుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో నీతులు చెప్పడం కాదు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరి మంత్ల్రను వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అసమర్థత పాలనకు బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌లతో పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న గంటా శ్రీనివాసరావు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
Back to Top