సిట్‌ దర్యాప్తు పురోగతి నివేదిక సీల్డ్‌ కవర్‌లో అందించాలి


హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. సిట్‌ రిపోర్టును మంగళవారం కోర్టుకు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణ తీరుపై ఉన్న అనుమానాలను హైకోర్టు న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. సిట్‌ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో తమ ముందు ఉంచాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై వైయస్‌ జగన్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఏపీ ప్రభుత్వ తీరు, పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కిందిస్థాయి ఉద్యోగుల చేత విచారణ చేయిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కత్తి మెడపై తగిలి ఉంటే వైఎస్‌ జగన్‌ ప్రాణాలే పోయి ఉండేవని జగన్‌ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంలో కుట్ర ఉందని.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీ లేని, విచారణ సంస్థల చేత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. హత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ వ్యవహరించారని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలను జగన్‌ తరపు న్యాయవాది వివరించారు.
 
Back to Top