రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన


– వ్యవస్థలను మ్యానేజ్‌ చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా?
–  పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం
– ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతోనే వైయస్‌ జగన్‌ పాదయాత్ర
– ఈ నెల 29న వైయస్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లకు చేరుతుంది
–  ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా పలు కార్యక్రమాలు
– ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలను అమలు చేసే ముఖ్యమంత్రి కావాలని కానీ, మ్యానేజ్‌ చేసే ముఖ్యమంత్రి అవసరం లేదన్నారు. బుధవారం విశాఖ పట్నంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వంలోని న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఉన్నాయన్నారు. ఏపీలో 22 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యంగ విరుద్ధమన్నారు. రాజ్యంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి ఉందన్నారు. అయితే వారిని చంద్రబాబు కాపాడుతూ రాజ్యాంగాన్ని నీరుగార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గానికి కొమ్ముకొస్తూ, తనవాళ్లను ప్రోత్సహిస్తూ, మిగతా మతాలను, సామాజిక వర్గాలను పక్కన బెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులను తనకు నచ్చిన వారికి కట్టబెట్టి, స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వ తీరును న్యాయస్థానాలు తప్పుబట్టినట్లు గుర్తు చేశారు. భూసేకరణచట్టాన్ని 2013లో తీసుకొని వచ్చిందన్నారు. ఈ చట్టం తనకు అనుకూలంగా లేదని, మార్పులు చేస్తే తప్ప తాను సంపాదించుకోలేనని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. డీజీపీల నియామాకాల్లో మార్పులు, చేర్పులు చేసి తనకు సంబంధించిన వారిని డీజీపీలుగా నియమించుకోవడం  దారుణమన్నారు. ప్రభుత్వం నేరుగా డిజిటల్‌ మీడియాలో ప్రవేశించకూడదన్న నిబంధనలు ఉన్నాయన్నారు. అయితే చంద్రబాబు డిజిటల్‌మీడియా రంగంలోకి ప్రవేశించి, తనకు వ్యతిరేకంగా ఏదైనా వార్తలు ప్రసారం చేస్తే నిలుపుదల చేసేలా పైబర్‌గ్రిడ్‌ను తీసుకువచ్చారన్నారు. నంద్యాల ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో అక్రమంగా ఖర్చు చేసి ప్రజా స్వామ్యవ్యవస్థను నీరుగార్చారన్నారు. రాష్ట్రపతి భార్య, కుటుంబ సభ్యులను అనుమతిలేని బోటులో ప్రయాణం చేయించి రాష్ట్రానికి చంద్రబాబు అపకీర్తి తెచ్చారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను నడిరోడ్డుపై హత్య చేసినా వారిపై ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. తనమాట వినని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే నిర్ణయించాలన్నారు.

వెయ్యి కిలోమీటర్ల సందర్భంగా పలు కార్యక్రమాలు
ఈ నెల 29న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అవుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా నెల్లూరు జి ల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఒక స్థూపం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతోనే వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.  వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి, విదేశాల్లో ఉన్న పట్టణాల్లో కూడా వైయస్‌ జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం..
ప్రత్యేక హోదా ఏపీకి ముమ్మాటికి సంజీవనే అని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. హోదా రాకపోతే ఏపీ అభివృద్ధి చెందే అవకాశం ఉండదన్నారు. ఎంపీల రాజీనామాల విషయంలో మా అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఇది వరకే ప్రకటించారన్నారు. బడ్జెట్‌ సమావేశాల తరువాత ఆ విషయాన్ని తెలియజేస్తామన్నారు. పార్లమెంట్‌లో ఎంపీలు ఉంటేనే ప్రశ్నించగలమన్నారు. అందుకే కాలయాపన జరిగిందన్నారు. మా విధానానికి అందరం కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సౌమ్యుడని, ప్రతి ఒ క్కరికి గౌరవం ఇస్తారని తెలిపారు.  

పత్రిక విలువలు పాటించాలి
పత్రికలు విలువలు పాటించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఏదైనా అంశంపై ఒక పార్టీ చెబితే ఆ విషయాన్ని రాయాలన్నారు.  వాస్తవాలను వక్రీకరించి రాయడం సరికాదన్నారు.  మా పార్టీ అధ్యక్షులు వైయస్‌జగన్‌ గతంలో ప్రధానికి ఓ లేఖ ఇచ్చారు. అందులో కొన్ని వ్యవస్థలకు సంబంధించిన అంశాలను పొందుపరిచామన్నారు. అదే మొదటి సారి కాదు..పలు సందర్భాల్లో ఆంధ్రజ్యోతి పత్రిక వక్రీకరించింది. జర్నలిస్టు సంప్రదాయాలను పాటించడం లేదన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. పత్రికలు విలువలు పాటించాలన్నారు. పలుమార్లు చెప్పినా కూడా అదే విధానాలను పాటిస్తూ..ఒక్క పార్టీకి కొమ్ముకాస్తూ..మాకు సమానమైన ప్రాతినిధ్యం కల్పించకపోవడంతోనే ఆంధ్రజ్యోతిపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 

ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా?
ప్రతిపక్షం ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులు అనడం సరికాదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారన్నారు. కానీ ఇటీవల పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ లేచి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడిగారని ప్రశ్నించారు. మేం పోరాటం చేయకపోతే ఈ రాష్ట్రానికి నీతి అయోగ్‌ సభ్యులు వచ్చేవారు కాదన్నారు. ఇటీవల చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలపై కోర్టును ఆశ్రయిస్తామని చంద్రబాబు అన్నారన్నారు. అదే మేం అంటే ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. జన్మభూమి కమిటీలు ఏ రాజ్యాంగంలో ఉన్నాయని ప్రశ్నించారు. స్పీకర్‌ వ్యవస్థ దెబ్బతినిందని, గవర్నర్‌వ్యవస్థను నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న నలుగురు మంత్రులను సైతం మా జాబితాలో పొందుపరిచారన్నారు. రాష్ట్రంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమా? సంకీర్ణ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. మాపై అభివృద్ధి నిరోధకలు అనడం సరికాదన్నారు. ఆయన భాగస్వామ్య పార్టీపై కోర్టుకు వెళ్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
 
Back to Top