మోత్కుపల్లిపై విజయమ్మ ఆగ్రహం

హైదరాబాద్, 15 మార్చి 2013:

అసెంబ్లీలో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యలపై శ్రీమతి విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అవిశ్వాసం ఎందుకు పెట్టామో స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. తాను చంద్రబాబును వ్యక్తిగతంగా ఏమీ అనలేదని స్పష్టంచేశారు. ఏం మాట్లాడానో రికార్డులు పరిశీలించండి. చంద్రబాబుపైనా కేసులున్నాయి, ఆరోపణలున్నాయన్నారు. దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. వీరికి సభ్యతా సంస్కారాలున్నాయా. నేను మాట్లాడాలంటే చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని ఎందుకు కలిశారనే దానిపై మాట్లాడాలి లేదా  ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో టీడీపీ సభ్యుల గైర్హాజరు గురించి మాట్లాడాలని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణల గురించి ఎందుకు అనుమతిచ్చారో అర్థం కావడం లేదనీ, ఈరోజు తాను చాలా బాధ పడుతున్నాననీ తెలిపారు. కోర్టు కేసుల గురించి మాట్లాడుతున్నారనీ,  ఏ కోర్టూ చంద్రబాబు నిర్దోషని చెప్పలేదు.. మహానేత డాక్టర్ వైయస్ఆర్, శ్రీ జగన్మోహన్ రెడ్డీ దోషులని చెప్పలేదన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తులోని అంశాలను సభలో ఎందుకు చదువుతున్నారని మోత్కుపల్లిని నిలదీశారు. స్పీకరు గమనించి చర్య తీసుకోవాలని శ్రీమతి విజయమ్మ కోరారు.

Back to Top