రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నిర్ణయం

హైదరాబాద్, 31 జూలై 2013:

స్వార్ధ రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర విభజనపై‌ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు‌ గడికోట శ్రీకాంత్రెడ్డి,‌ కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని వైయస్ఆర్‌ సిఎల్‌పి కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరాన్ని పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదేళ్ళు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి సీమాంధ్ర ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించి, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఆ తరువాత మాత్రమే రాష్ట్రాన్ని విభజిస్తే బాగుండేదేమో ఆలోచన చేయమని తాను విజ్ఞప్తిచేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్న తరువాత విభజన ముందుకు రావటం దురదృష్టకరం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా విభజన చేయడం చాలా బాధ అనిపిస్తోందన్నారు. గడచిన 60 ఏళ్ళలో రాయలసీమకు నాలుగు రాజధానులు అన్నట్లుగా అయిపోయిందని శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. 1952కు ముందు మద్రాసు రాజధానిగా ఉండేదని, తరువాత కర్నూలుకు వచ్చిందని, తరువాత హైదరాబాద్‌లో ఉన్నాం. ఇప్పుడు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. సీమాంధ్రకు రాజధానిని ఎక్కడ పెడతారో ఇంతవరకూ చెప్పలేదన్నారు. నికర జలాల విషయంలో కమిటీ వేస్తామంటున్నారు గానీ.. నీటి వాటాలు, రెవెన్యూ వాటాలపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసి. స్పష్టత ఇచ్చి తరువాత విభజన చేసి ఉంటే బాగుండేదని తమ వాదన అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో యువకులు తొందరపాటు చర్యలకు దిగవద్దని, తమ తమ కుటుంబాల గురించి ఆలోచించాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ నాయకులంతా బాధ్యత తీసుకుని పోరాటం చేస్తామన్నారు. సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకూ సీమాంధ్ర సరిహద్దు లేని హైదరాబాద్‌ నుంచి ఏ విధంగా పరిపాలన సాగించాలో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. నిర్ణయం కాక ముందు సరిగా స్పందించకుండా ఆఖరి నిమిషంలో హడావుడి చేశారని విమర్శించారు.

నాలుగు రాజధానులను మార్చుకున్న రాయలసీమ వాసులు ఈ సారి ఈ విషయంలో మరోసారి మోసపోకూడదని నిర్ణయించుకున్నామని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాజధాని విషయంలో కూడా కేంద్రం రాయలసీమ, ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే చూస్తారని ఆయన హెచ్చరించారు. రాజధాని విషయంలో నాలుగుసార్లు మోసపోయిన తాము రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరడంలో తప్పులేదన్నారు. సీమాంధ్రకు తిరుపతి రాజధానిగా ఏర్పాటు చేస్తే అందరికి అనువుగా ఉంటుందని సూచించారు.

సీమలో ఉన్న శాశ్వత నీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాలు ఇంత వరకూ కృషి చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తమ ప్రాంతంలో ఇప్పటకీ వర్షాలు పడక, కాలువల నీళ్ళు లేక రైతులు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పది పదిహేనేళ్ళుగా వేసిన పంటలు వేసినట్లే పోతున్నాయని విచారం వ్యక్తంచేశారు. ఏ ప్రాంతానికి ఏ విధంగా న్యాయం చేస్తారో చర్చకు రావాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే వ్యతిరేకించాలని తాము వ్యక్తిగతంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికే కాంగ్రెస్‌ నాయకులు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. వెనుకడిన రాయలసీమకు కచ్చితమైన పరిమాణంలో కృష్ణాజలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీమలోని అన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలను నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తామనే హామీని కేంద్రం ఇవ్వాలని కోరారు.

యుపిఎ తీసుకున్న విభజన నిర్ణయం చాలా బాధాకరమని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఇలా ప్రాంతాల వారీగా విభజించడాన్ని సిగ్గుచేటుగా తాము భావిస్తున్నామన్నారు. ఒకే ఒక్క రాహుల్‌ గాంధీ‌ లబ్ధి కోసం, 17 పార్లమెంటు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒడిగట్టిందని దుయ్యబట్టారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు నిబద్ధత లేదని ఆరోపించారు. ధైర్యం ఉంటే పదవులకు రాజీనామాలు చేసి లేదా సోనియాకు నచ్చజెప్పి రాష్ట్రాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఏ విధంగా ఆదుకుంటారో అఖిల పక్ష సమావేశం నిర్వహించి వివరించాలని కాంగ్రెస్‌ పార్టీని కొరముట్ల డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top