సోనియా స్వార్ధానికి చంద్రబాబు వత్తాసు

తిరుపతి, 10 ఆగస్టు 2013:

రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ చేసిన ద్రోహం వల్ల పెల్లుబికిన ఆగ్రహావేశాలతోనే ప్రజలు ప్రభంజనంలా రోడ్లపైకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. రాహుల్‌ను ప్రధానమంత్రిని చేయాలన్న స్వార్థ రాజకీయాల కోసమే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు ఒడిగట్టారని ఆరోపించారు. సోనియా స్వార్థానికి చంద్రబాబు పూర్తిగా వత్తాసు పలికారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద శనివారం నిర్వహించిన మహాధర్నాలో భూమన మాట్లాడారు. ఈ మహాధర్నాలో వేల సంఖ్యలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఎన్టీఆర్‌ సర్కిల్ ‌హోరెత్తి‌పోయింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ‌ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు కేంద్రానికి స్పష్టంగా లేఖలు ఇచ్చారని, ప్రకటనలు చేశారని నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన సోనియా, చంద్రబాబు కారణంగా సీమాంధ్ర ప్రజల మనసు గాయపడిందని భూమన విచారం వ్యక్తంచేశారు. విభజన విషయమై మూడు నెలల ముందే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి సమాచారం తెలిసినప్పటికీ అప్పుడు నోరు మెదపలేదన్నారు. విభజన ప్రకటన వచ్చిన తొమ్మిది రోజుల తరువాత సీమాంధ్రకు అన్యాయం జరిగిపోతోందంటూ వారిద్దరూ కపట నాటకాలు ఆడుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తంచేశారు. కపట నాటకాలు ఆడుతున్న టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు క్షమించబోరన్నారు. ఈ రాజ ద్రోహానికి పాల్పడిన సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను ఎవరూ ఉపేక్షించబోరని, ఆ పార్టీలకు సమాధి కడతారని భూమన హెచ్చరించారు.

సీమాంధ్ర ప్రాంతంలో నీటి విషయాన్ని పట్టించుకోకుండా, విద్యుచ్చక్తి అంశంలో భద్రత కల్పించకుండా సామాజిక, ఆర్థిక తదితర సమస్యలపై ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం అన్యాయమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ ఘోషిస్తోందని భూమన పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top