ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిరాహార దీక్ష

నెల్లూరు: నియోజకవర్గ అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో చేపట్టిన దీక్షను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రతి పనిలోనూ టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోకాలడ్డుతోందని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు నగర అభివృద్ధిని టీడీపీ నేతలు విస్మరించారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Back to Top