మంత్రి ఆదినారాయణరెడ్డిని బర్తరఫ్ చేయాలి

నంద్యాల: దళితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి వారినే కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాదరావు మండిపడ్డారు. దళితులు చదువుకోరు... శుభ్రంగా ఉండరు అని మాట్లాడిన ఆదినారాయణ ఏం చదువుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అజ్ఞానులు, చరిత్రహీనులు మాత్రమే ఇలా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. దళితుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు 16 డిగ్రీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏ భారతీయుడికి కూడా అన్ని డిగ్రీలు లేవన్నారు. స్వతంత్య్రం రాకముందు ఏ దళితుడు పేరు మీద భూమి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు పేదరికంగా ఉండక మరెలా ఉంటారన్నారు. మీలాంటి వాళ్లు దేశ సందపను దోచుకుతింటుంటే దళితులు పేదవాళ్లుగా ఉండకుండా మరెలా ఉంటారని ఆదినారాయణరెడ్డిని ప్రశ్నించారు. దళితులను కించపర్చిన ఆదినారాయణరెడ్డిని వెంటనే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడారని గుర్తు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు వెంటనే దళితులకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. దళితులు వేసిన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు మర్చిపోవద్దన్నారు. దళితులను అవమానించిన ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దహనం చేస్తున్నారని, క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఇంకా ఉధృతం అవుతుందని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top