ఎంపీ పదవికి మేకపాటి రాజీనామా

హైదరాబాద్ 05 ఆగస్టు 2013:

నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. నిర్దేశిత  ఫార్మాట్‌లో ఆయన తన రాజీనామ లేఖను లోక్ సభ స్పీకర్‌కు ఫ్యాక్సు చేశారు. రాజీనామా లేఖను ఆయన సోమవారం మధ్యాహ్నం మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వ్యక్తిగతంగా కలవమని కోరితే ఢిల్లీ వెళ్లి స్పీకరును కలుస్తానని' చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్న తీరుకూ, తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నందుకూ నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వివరించారు. తొలుత చంద్రబాబు తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చారన్నారు. తెలంగాణలో ఒకమాదిరిగా.. సీమాంధ్రలో ఒకమాదిరిగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణం తర్వాత తెలుగు ప్రజలతో ఆటాడుకోవడం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని టీడీపీ, కాంగ్రెస్ వారు సమైక్య రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటం సినిమాల్లోని డూప్ ఫైటింగ్ మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక్కరికి కూడా నిజాయితీ లేదనీ, అంతా నాటకమేననీ చెప్పారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు సమైక్యాంధ్ర కావాలని ఇప్పుడు పోరాడటమేమిటని నిలదీశారు. ఎప్పుడైనా సరే ఒకమాట మీద ఉండాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఏం చేశారో తెలియదనీ, ఇప్పుడు మరో హై లెవెల్ కమిటీని ఏర్పాటుచేస్తామనీ, అందులో తాను కూడా సభ్యుడిగా ఉంటాననీ దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తానని దిగ్విజయ్ చెప్పడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం వల్ల దేశమంతా విభజన మంటలు రేగాయని మేకపాటి విచారం వ్యక్తంచేశారు. చిన్నపాటి రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ క్రీడకు దేశం అంతా అట్టుడుకుతోందన్నారు. దేశాన్నే బలిచేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారన్నారు. అన్ని పార్టీలనూ పిలిచి ఏం చేయాలని కూడా అడగకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసేసుకుందని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలు కూడా విభజన తీరుకు నిరసనగా మాత్రమే రాజీనామాలు చేసిన విషయాన్ని మేకపాటి గుర్తుచేశారు.

Back to Top