మతంపై రాజకీయం వద్దు!

పులివెందుల, 21 అక్టోబర్ 2012 : దయచేసి మతంపై రాజకీయాలు వద్దని వైయస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షు రాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తాను బైబిల్ చేత పట్టుకుని క్రైస్తవ మత ప్రచారం సాగిస్తున్నానంటూ ఒక వర్గం మీడియాలో ప్రసారమైన కథనాలను ఆమె తీవ్రంగా ఖండించారు.
"నేనెక్కడా మతప్రచారం చేయలేదు. బైబిల్‌ చేత పట్టుకోవడం నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్లినా బైబిల్‌ తీసుకువెళతాను, అది అసెంబ్లీ అయినా, మరో మీటింగ్‌ అయినా. బైబిల్‌ నాకు మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుంది. నేను బైబిల్ పట్టుకోవడం, అది నా వ్యక్తిగతం. అది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు " అని విజయమ్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు.
"నాకు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నా భర్త పోయాక, నా కొడుకును జైలులో పెట్టిన తర్వాత విధి లేక రాజకీయాలలోకి వచ్చాను. ఈ పరిస్థితులలో నేను నిలబడే ధైర్యాన్నిచ్చేది బైబిల్. అంతే తప్ప నేనెక్కడా మత ప్రచారం చేయలేదే!" అని ఆమె ఆవేదనగా అన్నారు.
తన అల్లుడు అనిల్ చెబుతోంది దేవుని గొప్పదనాన్ని గురించి మాత్రమేననీ, మతాలను వదిలేయమంటూ ఎవరికీ చెప్పటం లేదనీ, తాను కూడా ప్రార్థనలు వెళ్లివస్తుంటాననీ ఆమె వివరణ ఇచ్చారు. "అనిల్ ఎవాంజలిస్టు. ఆయన వృత్తే అది" అని ఆమె చెప్పారు.
మతం లేదు, కులం లేదు, మనుషులందరిలోనూ ప్రవహించేది రక్తం, ఒకే రక్తం" అని ఆమె ఉద్వేగంగా అన్నారు.
"ఎక్కడిపోయినా బైబిల్‌ తీసుకు వెళతాను. అయితే నేను ఎక్కడైనా హిందూదేవాలయాలకు పోవడం లేదా, మసీదులకు పోవడం లేదా. ఎక్కడికి ఎవరు పిలిచినా వెళుతూనే ఉన్నాను. రాజశేఖర రెడ్డి మాకు నేర్పించింది మనుషులను ప్రేమించడమే. మానవత్వమే మా మతం. నిజానికి ఏ ముఖ్యమంత్రీ చేయలేదు, వైయస్సార్‌ హిందూ దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. అర్చకులకు జీతాలు ఇచ్చారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పూజారే ఈ విషయం చెప్పారు. ముస్లింలకు మైనారిటీ కోటా పెట్టింది వైయస్సే. ఆయన ఏ వర్గానికీ అన్యాయం చేయలేదు. అందుకే ఆయన పోయినప్పుడు 700 మందిదాకా గుండె పగిలి మరణించారు." అని విజయమ్మ గుర్తు చేశారు."
"ఇక దీని గురించి చర్చ అనవసరం. నిజానికి మా అమ్మవాళ్లు చాలా సంప్రదాయకుటుంబం. ఈ కలికాలంలో కూడా యాగాలు చేశారు. మా ప్రాంతానికి ఏ సాధుసంతులు వచ్చినా మా ఇంట్లో దిగాల్సిందే. మా తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఇంట్లో అఖండదీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. దేవుళ్లంతా ఒక్కటేనని మా నాయన నేర్పించారు. క్రిస్టియానిటీ చాలా తక్కువ భారతదేశంలో. కాబట్టి నేను మతప్రచారం చేయనక్కర లేదు.  "నా దేవుడు ఇదనీ, నా దేవుడిని నమ్మండనీ నేనెక్కడా చెప్పలేదు. బైబిల్ నా చేతిలో ఉంటుందంతే" ఆమె వివరించారు.
"తిరుపతిలో జగన్ బాబు విషయంలోనూ ఇలాగే వివాదం చేశారు. అప్పుడూ చెప్పాడు నా మతం మానవత్వమని" అని ఆమె గుర్తు చేశారు. "దయచేసి చేసి మతంపై రాజకీయం వద్దు. టీవీ9లో పీఠాధిపతులను కూడా పిలిచి చర్చ పెట్టారు. దీనిపై చర్చలు వద్దు. నాకు చాలా బాధ అనిపిస్తోంది. అందుకే పీఠాధిపతులకు, రాష్ట్ర ప్రజలకు కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, అనుమానాలు తీర్చుకోండి" అని విజయమ్మ ఆవేదనగా అన్నారు.

Back to Top