వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున తాను పాదయాత్ర చేపట్టానని ఆయన సోదరి షర్మిల స్పష్టం చేశారు. తాను జగన్‌కు తాత్కాలిక ప్రత్యామ్మాయాన్ని మాత్రమేనని పేర్కొన్నారు. ఆయన బెయిలుపై బయటకు రాగానే మరో ప్రజాప్రస్థాన బాధ్యతను అప్పగిస్తానని తెలిపారు. జాతీయ ఛానెల్ అయిన ఎన్డీటీవీ ప్రతినిధి మాయా శర్మకి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె వివిధ అంశాలను ప్రస్తావించారు. తన సోదరుడు జగన్ మాదిరిగా తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిని కానన్నారు. ఓదార్పు యాత్ర ద్వారా జగన్ తనను తాను నాయకుడిగా నిరూపించుకున్నారని చెప్పారు. మరో ప్రజాప్రస్థానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడానికి కారణం డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి స్మృతులు, ఆయన మరణం తరవాత జగన్ నాయకత్వమేనని ఆమె వివరించారు. 'ప్రజాప్రస్థానానికి కేవలం జగన్‌పై అభిమానంతోనే ప్రజలు హాజరవుతున్నారు. నాయకుడిగా ఎదిగిన ఆయన నామాన్ని వారెలా జపిస్తున్నారో మీరే చూడండ'ని చెప్పారు. పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిని కావాలన్న ఊహ కూడా తనకు లేదన్నారు. <br/>జగన్‌ను అరెస్టు చేసి జైలులో ఉంచడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్నీ చూపడం లేదని షర్మిల చెప్పారు. జగన్ తప్పు చేశాడని పార్టీ గానీ, ప్రజలు గానీ నమ్మడం లేదన్నారు. తప్పు చేశారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, జగన్ త్వరలోనే విడుదలై పార్టీని నడిపిస్తారనీ ప్రజలు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. పార్టీ బాధ్యత మోసే శక్తి తనకు లేదన్నారు. రాజకీయం తన పూర్తిస్థాయి వృత్తి కాదని మరోమారు స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా నల్ల పట్టీ ధరిస్తున్నట్లు తెలిపారు.మూడు వేల కిలోమీటర్ల మరో ప్రజా ప్రస్థానం చేపట్టడం ఈ దశలో అత్యవసరమన్నారు. నాలుగు వేల మంది రైతలు ఆత్మహత్యలకు పాల్పడిన దశలో రైతాంగం సమస్యలను తెలుసుకోవడానికి తన తండ్రి డాక్టర్ వైయస్ఆర్ 2003లో పాదయాత్ర చేపట్టారన్నారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు రైతుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. రెండెకరాలున్న రైతు 50వేల రూపాయలు వెచ్చించి సాగు చేస్తే అంతా నష్టపోయి, ఆర్థికంగా కుంగిపోయిన వైనాన్ని ఆమె ఉదహరించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు ఏ దశలోనూ ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సమయంలో తన తండ్రి పాదయాత్ర చేపట్టి వారిని కలిశారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని, అందుకే మరో ప్రజాప్రస్థానానికి తాను నడుం బిగించాల్సి వచ్చిందనీ షర్మిల విశదీకరించారు.<br/>జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్న అంశాన్ని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా సీబీఐ చేసిన ఆరోపణల్ని ఆమె ఖండించారు. గాలి జనార్దన్ రెడ్డితో గానీ ఆయన వ్యాపారాలతో గానీ తన సోదరుడు జగన్‌కు సంబంధాలు లేవని షర్మిల స్పష్టం చేశారు. <br/>