హైదరాబాద్ : వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించిన మంత్రులంతా రాజీనామా చేయాలని ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌గోనె ప్రకాశరావు గురువారం ఇక్కడ డిమాండు చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను ప్రాంతాలకు అతీతంగా ప్రోత్సహించి వారికి పదవులు కట్టబెట్టిన వైయస్‌ను ఈ మంత్రులు విమర్శించడం సిగ్గుచేటని హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో గోనె మండిపడ్డారు. వైయస్‌హయాంలో తప్పులు జరిగాయని విమర్శించే మంత్రులకు కేబినెట్‌లో కొనసాగే అర్హత లేనే లేదన్నారు. వారంతా ఈ విషయంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన డిమాండు చేశారు.వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై కూడా గోనె మండిపడ్డారు. చరిత్ర తెలియని వీహెచ్ వంటివారు ఇటువంటి అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇటీవల తన మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మానకు మద్దతుగా ఒక్కటవుతున్న మంత్రులు, మోపిదేవి వెంకటరమణ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని గోనె సూటిగా ప్రశ్నించారు. ధర్మానకు ఒక న్యాయం, మోపిదేవికి మరో న్యాయమా అని అన్నారు.