మహిళలంటే గౌరవం లేని సర్కారిది

గుంటూరు, 08 మార్చి 2013:

మహిళగా పుట్టినందుకు మీకెవరికైనా గర్వంగా ఉందా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తూబాడులో శుక్రవారం ఉదయం ఏర్పాటుచేసిన రచ్చబండకు హాజరైన మహిళలతో ఆమె ముచ్చటించారు. మరుగు దొడ్ల అంశంలో కూడా ఈ సర్కారు మిమ్మల్ని పట్టించుకోలేదంటే ఈ రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం శ్రద్ధ పెడితే ఇలా జరగదన్నారు. 'మరుగుదొడ్లు లేవు, పిల్లల్ని చదివించుకుందామనుకుంటే ఏ సౌకర్యమూ లేదు. పావలా వడ్డీకి రుణాల్లేవు, ఎక్కడ చూసినా రెండు రూపాయల వడ్డీ తీసుకుంటున్నారు... అంటూ మహిళలు గర్వపడడానికి ఏదైనా కారణముందా ఈరోజు అని ప్రశ్నించారు. మన రాష్ట్ర పరిస్థితి అలా తగలడిందని తీవ్ర విమర్శ చేశారు.

     మహిళలపై అత్యాచారాలు, ఇతర నేరాలు అంశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే దేశంలో ముందుందన్నారు. ఈ సర్కారుకు మహిళలంటే గౌరవం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారు పడుతున్న కష్టాల పట్ల సానుభూతి లేదన్నారు. వారెంత ఇబ్బంది పడుతున్నారో పట్టదన్నారు. కనీసం మంచినీళ్ళయినా మీ గ్రామానికి ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు లేవంటూ మహిళలు పెద్దగా సమాధానమిచ్చారు. మంచినీరు లేకుండా ఇల్లెలా నడుస్తుందంటూ, అందుకోసం మీరు కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచివెళ్ళాల్సి వస్తోందనీ, లేకపోతే డబ్బులు పెట్టి కొనాల్సి వస్తోందనీ చెప్పారు. ఇది కూడా ప్రభుత్వానికి పట్టలేదనీ మండిపడ్డారు. గ్రామాలకు వెళ్ళి చూస్తే ముఖ్యమంత్రికి మహిళల పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఇటీవలే క్యాంపు ఆఫీసుకు వెళ్ళిన కొందరు మహిళలు ముఖ్యమంత్రిని మంచినీటి విషయమై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంటూ వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల తెలిపారు. కనీసం సమాధానం చెప్పే ఓపిక గానీ, తీరిక గానీ లేవని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి వైఖరే ఇలా ఉంటే మహిళలు ఏం చూసుకుని గర్వపడాలని ఆమె ప్రశ్నించారు.

Back to Top