'మహానేత వైయస్‌పై అభాండాలు వేస్తే సహించం'

హైదరాబాద్, ‌6 జనవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డిపై అభాండాలు ‌వేయడం తగదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ అన్నారు. మహానేతకు కళంకం ఆపాదించేలా ఎవరు మాట్లాడినా సహించబోమని ఆయన హెచ్చరించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మహానత తనయుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని శనివారం ఆయన కలుసుకున్నారు. లక్ష్మీనారాయణతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ‌ చైర్మన్ చీర్ల రాధాకృష్ణ, అమ‌రచింత నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమ భూపాల్‌రెడ్డి తనయుడు శ్రీరామ్ భూపా‌ల్‌రెడ్డి వేర్వేరుగా ప్రత్యేక ములాఖత్‌లలో శ్రీ జగన్‌ను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహరహం శ్రమించిన మహానేత వైయస్‌ కుటుంబం పట్ల కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర పూరితంగా వ్యవహరించడం తగదని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న కుమ్మక్కు రాజకీయాలను చూడలేక శ్రీ జగన్‌కు అండగా ఉండేందుకు వైయస్‌ఆర్‌సిపిలో చేరుతున్నట్లు తెలిపారు.

అధికార, ప్రతిపక్ష పార్టీల కుటిల రాజకీయాలను సహించలేకపోతున్నామని, అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు చీర్ల రాధాకృష్ణ చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

కాంగ్రెస్, ‌టిడిపిల నీచ రాజకీయాల కారణంగా జైలులో ఉన్న‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని శ్రీరామ్‌భూపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి విశేష సేవలు చేసిన రాజశేఖరరెడ్డి తనయుడిని ఇన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయం అన్నారు.

ఇలా ఉండగా, మల్లుల లక్ష్మీనారాయణ, చీర్ల రాధాకృష్ణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు.
Back to Top