మానవత్వం మరిచిన ప్రభుత్వం: షర్మిల

ఆదిభట్ల (రంగారెడ్డి జిల్లా), 13 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, తన సోదరుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే, రాజన్న ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తారని ఆయన సోదరి శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ప్రజల బాగు కోసం ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కొమ్ము కాస్తున్న చంద్రబాబు తీరును ఆమె తూర్పారపట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్లలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పరిపాలనా కాలంలో 71 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే, టిడిపి హయాంలో కేవలం 16 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ లబ్ధి పొందగలిగారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రాజన్న రాజ్యం తీసుకువస్తారని, వికలాంగులు ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 1000, వృద్ధులు, వితంతువులకు రూ. 700 వంతున పెన్షన్‌ సక్రమంగా అందజేస్తారని భరోసా ఇచ్చారు. పెన్షన్‌ పథకాన్ని అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం దారుణంగా విఫలమైందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ ప్రభుత్వం చేతకాని తనం కారణంగా నెలకు రూ. 200 పెన్షన్‌ కూడా సక్రమంగా అందడంలేదని దుయ్యబట్టారు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని దుయ్యబట్టారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం  ఇలాంటి ప్రజా వ్యతిరేక, అసమర్థ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని నిప్పులు చెరిగారు.

మన రాష్ట్రాన్ని విద్యుత్‌ సంక్షోభం వెంటాడుతోందని శ్రీమతి షర్మిల అన్నారు. కరెంట్ ఉండేది ‌నాలుగు గంటలే అయినా బిల్లులు మాత్రం నాలుగు రెట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు కట్టడానికి, బిల్లులు కట్టలేక జైలులో ఉన్నతమ భర్తలను విడిపించుకోవడానికి ఆడపడుచులు తమ తాళిబొట్లను తాకట్టు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌- టిడిపిలు కుట్ర చేసి జైలుకు పంపాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. అయితే, న్యాయం జగనన్న పక్షాన ఉందని, దేవుని దయ ఉందని, కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులున్నాయని, త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తారని ఆమె పేర్కొన్నారు. జగనన్న బయటికి వచ్చాక రాజన్న రాజ్యం వైపు మనలను నడిపిస్తారని తెలిపారు. 


Back to Top