మానవతావాది.. స్నేహశీలి..

హైదరాబాద్:

దివంగత ముఖ్యమంత్రి  మహానేత డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి పాలిచెర్ల కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్ప మానవతా వాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. ఆయన స్నేహశీలనీ,  కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించిన మహనీయుడనీ నివాళులర్పించారు. కిరణ్ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సంతాప సభ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటైంది.  ఇందులో పార్టీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని కిరణ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వ్యక్తి అర్ధాయుష్షుతో మరణించడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘కిరణ్ ఏ పనైనా ఒక క్రమపద్ధతిలో చేసేవారు. ఆయన లేకపోవడం పార్టీకి లోటుగా భావిస్తున్నాం. పార్టీలో తెర ముందుండి పనిచేసే వారు కొందరుంటే ఏ మాత్రం అధికార కాంక్ష లేకుండా తెర వెనుక ఉండి పనిచేసే వారిలో కిరణ్ ఒకరు’ అని అన్నారు.

పేదల పట్ల కరుణామయుడు
      పేదల పట్ల నిజమైన కరుణామయుడు కిరణ్ అని పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు  కొనియాడారు. మహానేత అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి కిరణ్ అని పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. నాగదేశి రవికుమార్, మేడపాటి వెంకట్ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చాక కిరణ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించాలని సూచించారు. కిరణ్ ద్వారా ప్రభుత్వ సహకారం పొందిన యాసిడ్ బాధితురాలు అరుణ వ్యక్తం చేసిన సంతాపాన్ని పార్టీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సభకు తెలియజేశారు.

ఇది జోల కాదు.. అంతిమ గీతిక

     ‘నీవు లేని మాట నిజమా... నాన్నా కిరణ్... ఇది జోల పాటు కాదురా తండ్రీ! జోహార్, జోహార్ అని పలవరించే అంతిమ గీతిక’ అంటూ కిరణ్ తల్లి 74 ఏళ్ల లీలా చంద్రారెడ్డి గద్గద స్వరంతో చదివిన కవిత అందరినీ కంటతడి పెట్టించింది. కుమార్తె ఐక్య ‘తల్లి ఒడిలో ఆడుకోరా హాయిగా కన్నా...’ అని పాడిన పాట కూడా కలచి వేసింది. మేనకోడలు దివ్యదీప్తి మాట్లాడుతూ.. తన మేనమామ ఆసుపత్రిలో మృత్యువుకు సమీపిస్తున్న సమయంలో కూడా షర్మిల పాదయాత్ర ఎలా సాగుతోందో, జగన్ జైలులో ఎలా ఉన్నాడో అని ఆరా తీసేవారని కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అధికార ప్రతినిధి బి. జనక్‌ప్రసాద్ నిర్వహించిన ఈ సంతాప సభలో నేతలు ఎం.మారెప్ప, గట్టు రామచంద్రరావు, బి.జనార్దన్‌రెడ్డి, వి.ఎల్.ఎన్.రెడ్డి, కె.శివకుమార్, వంగపండు ఉష, నాగిరెడ్డి (లీగల్ సెల్) ప్రసంగించారు. కిరణ్ దశదినకర్మ జనవరి 5న మణికొండ సమీపంలోని అల్కాపురి వద్ద ఆయన స్వగృహంలో నిర్వహిస్తారని జనక్ ప్రసాద్ తెలిపారు.

Back to Top