మా హర్షను.. హత్య చేశారన్నా..
న్యాయం కోసం వెళ్తే దుర్భాషలాడుతున్నారు
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు
జననేతను కలిసిన వీరఘట్టం హర్షవర్ధన్‌ తల్లిదండ్రులు
తమకు అండగా నిలవాలని కన్నీరుపెట్టిన బాధిత కుటుంబం
శ్రీకాకుళం: తమ కొడుకును హత్య చేశారని, న్యాయం కోసం పాలకులు, అధికారుల దగ్గరకు వెళ్తే దుర్భాషలాడుతున్నారని వీరఘట్టానికి చెందిన హర్షవర్ధన్‌ తల్లిదండ్రులు జననేత ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం చేయాలని, తమ కొడుకును చంపింన వారెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. వీరఘట్టం ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్‌ టెక్కలి ఐతం కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. హర్షవర్ధన్‌ అనుమానాస్పద మృతి చెందాడు. పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాధిత తల్లిదండ్రులు కలిశారు. తమ కొడుకును చంపేశారని, తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. మృతిపై ఫిర్యాదు చేసినా పోలీసులు విచారణకు సిద్ధపడడం లేదని, మంత్రి అచ్చెన్నాయుడి దగ్గరకు వెళ్తే దుర్భాషలాడారని జననేత ఎదుట వాపోయారు. కేసు విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకొస్తామని, మన ప్రభుత్వం వచ్చాక దోషులను శిక్షిస్తామని బాధిత తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. 

హర్షవర్ధన్‌ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని బాధిత తల్లిదండ్రులు చెప్పారు. మృతి వార్త తెలిసిన తరువాత హుటాహుటిన టెక్కలి వెళ్తే 48 గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదని, తల, మొండెం వేరు చేశారని ఇది ముమ్మాటికీ హత్యేనన్నారు. జీపీఎస్‌ పరిధిలో ఉన్న కేసులో సివిల్‌ పోలీసులు కలగజేసుకొని తమను భయపెట్టి పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించకుండా భారీ బందోబస్తుతో వీరఘట్టం తీసుకువచ్చారన్నారు. ఆత్మహత్య అయినప్పుడు ఎందుకు అంత బందోబస్తు కల్పించాల్సిన అవసరం ఏముందని, మృతదేహంపై గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీజీపీ, డీఐజీ దగ్గరకు వెళ్లి బాధను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, మంత్రి అచ్చెన్నాయుడు దుర్భాషలాడారన్నారు. కోడిని కోసినట్లు తల, మొండెం వేరు చేశారని కన్నీరు పెట్టుకున్నారు. 
Back to Top