'కుర్చీ' ఒక్కటే కాంగ్రెస్, టిడిపిల టార్గెట్!



కూడేరు

31 అక్టోబర్ 2012 : కాంగ్రెస్, టిడిపిల లక్ష్యం 'కుర్చీ' ఒకటేనని షర్మిల విమర్శించారు. "వారి టార్గెట్ కూడా ఒకటే..అది జగన్" అని ఆమె అన్నారు.
జగన్ జనంలో ఉంటే తమకు మనుగడే ఉండదని వారి భయమనీ, అందుకే కాంగ్రెస్, టిడిపిలు కలిసి కుట్ర చేసి సిబిఐని వాడుకుని జగనన్నను జైలుపాలు చేశాయనీ ఆమె నిందించారు. కానీ జగనన్న తప్పక బయటకు వస్తాడనీ రాజన్న రాజ్యం తెస్తాడనీ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 14 వ రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో జరిగిన ఒక భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. కూడేరులో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది జనం ఆమె సభకు హాజరయ్యారు.
చంద్రబాబు, కాంగ్రెస్ నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనీ, ఎంఎల్ఏ, ఎంఎల్‌సి ఎన్నికలలో కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నారనీ, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమనీ ఆమె ఈ సభలో వ్యాఖ్యానించారు. "అంత మంది ఎమ్మెల్యేలున్న బాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమిటి? అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయవచ్చు. కానీ బాబు అవిశ్వాస తీర్మానం పెట్టడట. అవసరమైతే ఈ ప్రభుత్వంపై విశ్వాసతీర్మానం కూడా పెడతాడట. ఈ ప్రభుత్వాన్ని దించడు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయడు." అని ఆమె ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలూ కూడబలుక్కుని ఇవాళ నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల విమర్శించారు. ప్రభుత్వవైఫల్యాలను కూడా ఆమె ఎండగట్టారు.
ఈ పాపం ఊరకే పోదు!
"వైయస్ ఉన్నంతకాలం పిఎబిర్‌కు తుంగభద్ర నుండి నీరు తెచ్చి ఇచ్చారు. దాంతో రైతులు సంతోషంగా ఉండేవారు. భూగర్భజలాలు నిండుగా ఉన్నాయి. తాగునీటికీ సమస్య లేదు. కానీ రెండేళ్లుగా ఈ ప్రభుత్వం దానికి నీళ్లివ్వడం లేదు. ప్రతి ఏడాదీ దీనికి నీళ్లివ్వాలని రాజశేఖర్ రెడ్డిగారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఈ ప్రభుత్వానికి అది పట్టడం లేదు. సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా ఉండడం లేదని గ్రామాలలో వాపోతున్నారు. దానికి నీళ్లిచ్చి వుంటే అరటి, చీనీతోటలు కానీ శెనక్కాయ పంటలు కానీ ఎండిపోయేవి కావు. ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. కరెంటు లేదు. వైయస్ నాడు 7 గంటలు విద్యుత్తు ఇచ్చేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం రెండుమూడు గంటలు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతోంది. ఇప్పుడే దారిలో ఒక రైతును కలిశాం. ఆయనకు చీనీ తోట ఉంది. దానికి రూ.20 వేల కరెంటు బిల్లు వచ్చిందట.మూడేళ్ల సర్‌చార్జీలు కలిపి ఇప్పుడు ఇరవై వేలు కట్టమంటున్నారట. అధికారులు వేధిస్తున్నారట. ఇలా అయితే మాకు దిక్కులేదు, ఏ పురుగుల మందో తాగి చనిపోవడం తప్ప అని ఆ రైతు వాపోయాడు. అసలే అప్పులు, కరువు. ఒక పక్క నీళ్లు లేవు, కరెంట్ లేదు... రుణాలివ్వరు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వరు. ఏదీ చెయ్యరు. ప్రతి విషయంలో రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ పాపం ఊరకే పోదు." అని షర్మిల నిందించారు.
పేద విద్యార్థుల చదువుకు ఉద్దేశించిన ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ పథకానికి కూడా  ప్రభుత్వం కత్తెరలు పెడుతోందనీ, భిక్షమిచ్చినట్లు ప్రవర్తిస్తోందనీ ఆమె మండిపడ్డారు. నిరుపేదకు కూడా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం నీరుగార్చుతోందనీ, ప్రధాన వ్యాధులను జాబితాలోంచి తొలగించిందనీ ఆమె విమర్శించారు.
చంద్రబాబు పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. " చంద్రబాబు సొంతమామనే వెన్నుపోటు పొడిచి 9 నెలల్లోనే కుర్చీ లాగేసుకున్నాడు. ఎన్టీఆర్‌ నాడు ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం, సంపూర్ణ మద్యనిషేధం అన్న రెండు ప్రధాన వాగ్దానాలను బాబు నీరుగార్చాడు. బాబుకు మాట మీద నిలబడే అలవాటు లేదు. ఆయన మాట ఇవ్వలేడు. నిలబడలేడు. బాబు తన మనసులో మాటలో ప్రాజెక్టులు దండగన్నాడు. సబ్సిడీలు ఇస్తే జనం సోమరులౌతారట. అందుకే కరెంటు చార్జీలను విపరీతంగా పెంచేశారు. ఎనిమిదేళ్లలో ఎనిమిదిసార్లు పెంచారు."అని షర్మిల తూర్పారబట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో మహానేత విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాత్రికి ముద్దలాపురం సమీపంలో షర్మిల బస చేస్తున్నారు. షర్మిల పాదయాత్రలో బుధవారం మొత్తం 12 కిలోమీటర్ల దూరం నడక సాగింది.

Back to Top