క్షమాపణ చెప్పే సంస్కారం కేసీఆర్‌కు ఉందా?

గద్వాల (మహబూబ్‌నగర్‌ జిల్లా), 27 నవంబర్‌ 2012: ఓబుళాపురం, బయ్యారం గనుల్లో మా పెట్టుబడి ఒక్క రూపాయి కూడా లేదు, మాకు వాటాలు లేవని రుజువు చేస్తే మా చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పే సంస్కారం టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు ఉందా? మహానేత వైయస్‌ తనయ, జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సూటిగా ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఒక కంపెనీకి గనుల స్థలాలు కేటాయిస్తే మాకేమి సంబంధం కేసీఆర్‌గారూ అని ప్రశ్నించారు. జగనన్నకు ఓబుళాపురం గనులు, ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను రాజశేఖరరెడ్డి రాసిచ్చారని కేసీఆర్‌ చెబుతుంటారు. వాటితో మాకు సంబంధంలేదని ఎన్నిసార్లు మేం చెబుతున్నాఆయన అవి మావే అని పదేపదే అంటున్నారు. మీకూ బిడ్డ ఉంది కేసీఆర్ గారూ, ఆమెపై ఎవరైనా నిందలు వేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మరి మా మీద మీరెందుకు ఇలా నిందలు వేస్తున్నారని నిలదీశారు. తాగునీరు, సాగునీరు లేని గద్వాల ప్రాంతం సమస్యలను స్థానిక ఎంపీ కె. చంద్రశేఖరరావు ఏనాడూ పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. 'మీ సిటింగ్‌ ఎంపి కె. చంద్రశేఖరరావుకు మీ బాధలు పట్టవు. ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటాలు చేయలేదు.' అని ఆమె దుయ్యబట్టారు. ప్రాంతీయ రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సమస్యలు ఆ పార్టీ పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రాంతం అంటే మహానేత వైయస్‌కు ప్రేమ లేదని కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి ఆశీస్సుల కోసమని తాను తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. వైయస్ తన పాదయాత్రను తెలంగాణలోనే మొదలుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన ప్రారంభించిన కిలో రెండు రూపాయల బియ్యం పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, పావలా వడ్డీ అయినా ఏ పథకాన్ని అయినా తెలంగాణలోనే మొదలుపెట్టలేదా అని నిలదీశారు. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారని, వారిలో ఏ ఒక్కరైనా ప్రాణహిత చేవెళ్ళ - ప్రాజెక్టును నిర్మించే సాహసం చేశారా? అని ప్రశ్నించారు. కొంతమంది ముఖ్యమంత్రులు ఇది చాలా కష్టమని పక్కన పెట్టేశారన్నారు. వైయస్‌కు తెలంగాణ పట్ల ప్రేమ లేకపోతే ప్రాణహిత - చేవెళ్ళను ఎందుకు నిర్మించాలనుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు 7 జిల్లాలను సస్యశ్యామలం చేస్తుందని, 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు అవసరమని, ఎంత మంది కష్టం అని చెబుతున్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంది కనుకే నిర్మించాలని వైయస్‌ సాహసం చేశారని గుర్తుచేశారు. తన అధికారులను చైనా కూడా తీసుకువెళ్ళి 'త్రీ గార్జెస్‌' పథకాన్ని చూపించి, మన దేశంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల ప్రాణహిత - చేవెళ్ళ పథకాన్ని చేయాలని ఎంతగానో తపించారు. దానికి జాతీయ హోదా కల్పించాలని కృషిచేశారన్నారు. తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేకపోతే ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తారని అడుగుతున్నామన్నారు.

ప్రజా సమస్యలను పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానికి దొడ్డిదారిన వత్తాసుగా నిలుస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం పాలమూరు జిల్లా గద్వాల చేరింది. ఈ సందర్భంగా గద్వాలలో నిర్వహించిన బహిరంగసభలో షర్మిల కాంగ్రెస్‌, టిడిపి, టిఆర్‌ఎస్‌ పార్టీలు, ఆ పార్టీల నాయకులను ఉతికి ఆరేశారు. జిల్లాలోని, ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలోని సమస్యలు, ప్రాజెక్టులు, పంటలు, విద్యుత్‌ తదితర అంశాలపై షర్మిల తన ప్రసంగంలో ప్రధానంగా దృష్టి సారించారు. గద్వాల సభకు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభకు వచ్చిన వారితో గద్వాల జనసముద్రంలా మారిపోయింది. అంతకు ముందు బహిరంగ సభ ప్రాంతంలో ఉన్నమహానేత వైయస్‌ విగ్రహానికి షర్మిల పాలాభిషేకం చేశారు.

'నడిగడ్డ ప్రజలకు, చేరి వచ్చిన మీ అందరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు షర్మిల చేతులు జోడించి నమస్కరిస్తోంది' అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గద్వాల అంటే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది 'గద్వాల చీరలు'. మన రాష్ట్రానికే వన్నె తెచ్చింది గద్వాల అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న గద్వాల ప్రజలకు, ఈ ప్రాంతానికి మా సలాం అన్నారు. రాజన్నకు, జగనన్నకు చేనేత కార్మికులంటే ప్రత్యేక అభిమానం అన్నారు. చంద్రబాబు హయాంలో ఆప్కోను మూయించి, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆయన హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు మహానేత వైయస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇచ్చిన విషయాన్ని షర్మిల గుర్తుచేశారు. వారికి సబ్సిడీలు ఇచ్చేందుకు, మళ్ళీ సొసైటీలు పెట్టి నిలబెట్టడానికి రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారన్నారు. చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం రాజశేఖరెడ్డి రూ. 312 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకూ విడుదల చేయలేదని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల బతుకులు బాగుపడాలని ఎన్నోరోజులు, ఎన్నో ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేశారని పేర్కొన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 3 లక్షల మంది గీత కార్మికులు ఉంటే, చంద్రబాబు హయాంలో ఒక్కో చెట్టు మీద ఐదు వందల రూపాయల పన్ను వేశారు. వైయస్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.25 కు తగ్గించిన విషయాన్ని షర్మిల గుర్తుచేశారు. గీత కార్మికులకు సొసైటీలు పెట్టి వారిని నిలబెట్టడమే కాకుండా వారి కుటుంబాలకు కాని వారికి గాని ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారంగా చంద్రబాబు రూ. 60 వేలు ఇస్తుంటే వైయస్‌ దాన్ని రెండు లక్షలకు పెంచారని పేర్కొన్నారు. చేనేత కార్మికులకైనా, గీత కార్మికులకైనా 50 సంవత్సరాలకే పింఛన్‌ ఇవ్వాలని ఆలోచన చేసింది రాజశేఖరరెడ్డి అని తెలిపారు.

ఇక గద్వాల ప్రాంతానికి సంబంధించి నెట్టెంపాడు ప్రాజెక్టుకు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం ఎలక్షన్ల కోసమని 2004లో హడావుడిగా 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేందుకు శంకుస్థాపన చేశారన్నారు. వైయస్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని రెండు లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని, 1400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నా సరే ధైర్యంగా ముందుకు వచ్చి 1200 కోట్ల రూపాయలు తానే ఖర్చుపెట్టేసి 75 శాతం పనులు పూర్తిచేశారన్నారు. మిగిలిన కేవలం 25 శాతం పనులు చేయడానికి మూడేళ్ళు గడిచినా చిత్తశుద్ధి లేని కారణంగా నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని దుయ్యబట్టారు. గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించారని, దాని నుంచి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ పాపం సర్కారుది కాదా అని ప్రశ్నించారు.

తాగునీరు ఇవ్వకపోతే మంత్రికి అవమానం కాదా?:
ఇక ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య తాగు నీరు అని షర్మిల ప్రస్థావించారు. రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు జూరాల 2నుంచి పైప్‌లైన్‌ తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని 180 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని వెళ్ళారు. ఈ ప్రభుత్వం దాన్ని కూడా మూడేళ్ళుగా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. పాదయాత్రగా ఈ దారి వెంట తాను నడుచుకుంటూ వస్తున్నప్పుడు తాగు నీరు లేదని మహిళలు ఏడుస్తున్న తీరు తనను కదిలించివేసిందన్నారు. తాగడానికి కూడా నీళ్ళు లేవంటుంటే ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ఇక వేరే చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ఇక ఈ నియోజకవర్గం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వకపోతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన డి.కె. అరుణకు అవమానంగా లేదా అని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సూటిగా ప్రశ్నించారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు పెట్టే శ్రద్ధలో సగం నియోజకవర్గం ప్రజల తాగునీటి మీద పెడితే ఈ సమస్య ఉండేదే కాదన్నారు. 'మీరు ఒక్కరే చక్కగా ఉంటే సరిపోదు.. మీ నియోజకవర్గం ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతా మీదే' అని ఆమె సష్టంగా సూచించారు. ఈ ప్రభుత్వానికి గాని, మీ మంత్రికి గాని చిత్తశుద్ధి లేదు గనుక 'గద్వాల ప్రాంతంలో సాగునీరు లేదు, తాగు నీరు లేదు. ప్రజలు ఎలా బతుకుతున్నారో స్థానిక మంత్రి పట్టించుకోరు' అని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడి హయాంలో తెలంగాణలో ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది కేవలం 700 కోట్ల రూపాయలని, వైయస్‌ రాజశేఖరరెడ్డి ఖర్చు చేసింది రూ. 25 వేల కోట్లని షర్మిల వివరించారు. ఇప్పటి ప్రభుత్వం వ్యయం చేసింది కేవలం రూ. 7 వేల కోట్లని తెలిపారు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతం అంటే ఎవరికి ప్రేమ ఉండో తెలియడంలేదా కేసీఆర్‌ గారూ అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. వైయస్‌ ఏ పని చేసినా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉందా అనే ఆలోచించేవారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి వైయస్‌ 30 సంవత్సరాలు సేవలు చేశారని, రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారని షర్మిల తెలిపారు. కనీస కృతజ్ఞత లేకుండా ఈ కాంగ్రెస్‌ వాళ్ళు వైయస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న రాజ్యసభ సభ్యులు, ఇప్పుడున్న కేబినెట్‌ మంత్రులు వేడుక చూశారు తప్ప ఒక్కరికి కూడా చీమ కుట్టునట్లయినా లేదని దుయ్యబట్టారు. పెదాలకు మాత్రమే పరిమితం అయితే దాన్ని అభిమానం అనరన్నారు. అభిమానం గుండెల్లో నుంచి రావాలన్నారు. మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి ఇప్పుడు సిగ్గు లేకుండా ఆయనను తమ మనిషి అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి పేరు ఉచ్ఛరించేందుకు కూడా వారికి అర్హత లేదని షర్మిల హెచ్చరించారు. ఒక్క రాజశేఖరరెడ్డినే కాకుండా ఆయన ఏర్పాటు చేసిన పథకాలన్నింటికీ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. ఆయనను మీ గుండెల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

రాజన్న రాజ్యంలో రైతే రాజు అని అన్నారు. రైతు పక్షాన ఆయన నిలబడ్డారన్నారు. ఇప్పటి ప్రభుత్వానికి అంతటి పెద్ద మనసు లేదన్నారు. ఏ రైతును కదిలించినా అప్పుల్లో కూరుకుపోయానని విలపిస్తున్నాడన్నారు. మహిళలను కూడా ఈ ప్రభుత్వం హింసిస్తోందన్నారు. ఉపాధి కూలీ కేవలం రూ. 30 ఇస్తున్నారు. గ్యాస్‌ ధర వైయస్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదన్నారు. విద్యుత్‌ సమస్యతో రైతులు, విద్యార్థులు, పరిశ్రమలు నానా ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చెప్పారు.

విద్యార్థులకు వైయస్‌ కన్న తండ్రి స్థానంలో నిలబడ్డారని షర్మిల చెప్పారు. ప్రతి ఇంటిలో బిడ్డలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటుందని వైయస్‌ ఆలోచించేవారు. ఆరోగ్యశ్రీ మూలన పడిందన్నారు. 108 ఏమైందో కనిపించడంలేదన్నారు. ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం పాతరేస్తోందన్నారు.

చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్ళు అధికారంలో ఉంటే ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. కట్టలేమని రైతులు మొత్తుకుంటే వారిని జైళ్ళలో పెట్టారని, ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్లు పెట్టి జైళ్ళలో పెట్టారన్నారు. ఆ సమయంలో వైయస్‌ నిరసన దీక్ష చేస్తే ఆఖరిరోజున రైతులపై పోలీసుకాల్పులు చేయించి ప్రాణాలు తీశారన్నారు. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు వైయస్‌ పరిహారం ఇచ్చారన్నారు. రుణమాఫీ చేయించారన్నారు. తన హెరిటేజ్‌ డయిరీ కోసం చిత్తూరులోని ఎపి డయిరీని చంద్రబాబు మూయించేశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చంద్రబాబుకు అనంతరం గుర్తుండవన్నారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును అక్రమంగా పెంచేస్తే అసమర్ధుడిలా ఊరుకుండిపోయారని దుయ్యబట్టారు. తాను శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లో తిరుగుతూ అధికారం కావాలంటూ పాదయాత్ర చేస్తూ, అబద్ధాల వాగ్దానాలు చేస్తూ కొత్త డ్రామాలు చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లు ప్రజలు పిచ్చివాళ్ళు కాదన్నారు. ఒక్క రాజన్నకు, జగనన్నకూ ఉన్నది విశ్వసనీయత, మాట మీద నిలబడే తత్వమని చంద్రబాబుకు కూడా తెలుసన్నారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌ ప్రభుత్వం కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. ఒక్క ఆధారం కూడా లేకపోయినా జగనన్నను అరెస్టు చేయించి ఆరు నెలలుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సిందే అని ఆ రెండు పార్టీలకూ తెలుసన్నారు. అయితే, జగనన్నకు దేవుని పైన, ప్రజల ప్రేమ మీద అచంచలమైన విశ్వాసం ఉందని షర్మిల ఉద్ఘాటించారు. జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యాన్ని స్థాపించే దిశగా మన అందర్నీ నడిపిస్తారన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధి చెప్పాలని, జగనన్నను ఆశీర్వదించాలని సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి వస్తే రాజన్న ఆశయాలన్నింటినీ నెరవేరుస్తారని షర్మిల భరోసా ఇచ్చారు.
Back to Top