కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్

 

(బుచ్చిరెడ్డిపాళెం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తుగ్లక్ పాలనలాగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శుక్రవారం బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని పలుగ్రామాల్లో జరిగిన రోడ్‌షోల్లో మాట్లాడారు. ‘తుగ్లక్ పాలనకు నిదర్శనం ఏంటంటే ప్రచారం చేసుకోవడానికి ప్రచారరథానికి అనుమతిని ఇస్తారట...మాట్లాడానికి మైకుకు మాత్రం అనుమతించరట...అంతే కాదు, ప్రజా సమస్యల పరిస్థితీ అలాగే ఉంది...చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసే విషయాన్ని విస్మరించారు. విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.’ అని ఆయన అన్నారు.

ఆత్మసాక్షిగా ఓట్లు వేయండి

కాంగ్రెస్, టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో డబ్బు మూటలతో ప్రజల ఆత్మీయానురాగాలను వేలం వేసి కొనుగోలు చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలు తమ మనస్సాక్షి మేరకే ఓటు వేయాలని జగన్ కోరారు. ‘ఈ రోజు పొద్దున పత్రికల్లో కూడా చదివాను... కాంగ్రెస్, చంద్రబాబుగారి తెలుగుదేశం పార్టీల వద్ద డబ్బులు పుష్కలంగా ఉన్నాయి...వాళ్లు డబ్బు సంచులతో పట్టుబడ్డారు....ప్రతి అక్క, చెల్లి...ప్రతి అవ్వా, తాత, ప్రతి సోదరుడికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... మీ మనస్సాక్షి ఎలా చెబితే అలా ఓట్లు వేయండి...’ అని కోరారు.

తనకు ఇరువైపులా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇద్దరూ నిన్నటి వరకూ ఎం.పిగా, ఎమ్మెల్యేగా ఉన్నారని, వారిద్దరూ రాజకీయాల్లో విలువలకు కట్టుబడి తమ పదవులకు రాజీనామాలు చేశారని జగన్ అన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత పెంపొందించాలని, నిజాయితీగా పేదవాడికీ, రైతుకూ అండగా నిలబడాలని వారు పదవులు కోల్పోయారన్నారు. అలాంటి వారికి చల్లని దీవెనలు ఇచ్చి ఓటర్లు తమ సంపూర్ణ మద్దతు తెలపాలని, తాను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ రైతులకు గిట్టుబాటు ధర లేదంటే పట్టించుకోరు, కూలీలకు సరైన కూలీ రావడం లేదంటే పట్టించుకోరు, చేనేత కార్మికుల గురించి పట్టించుకోరు, వారి రుణాల మాఫీని విస్మరించారు..’ అని ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును దుయ్యబట్టారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలన్నీ ఆయన మరణం తరువాత పడకేశాయని జగన్ విమర్శించారు. ప్రజా సమస్యలపై కనీసం ప్రతిపక్షమైనా పోరాడుతుందా అని ప్రజలు ఎదురు చూస్తుంటే చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆయన విమర్శించారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై ఆర్టీఐ కమిషనర్ల పదవులను పంచుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ వెంట రోడ్‌షోలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సీహెచ్ బాలచెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం ప్రచారం పూర్తయ్యాక ఆయన ఆత్మకూరు మీదుగా కడపకు బయలుదేరి వెళ్లారు.

 

Back to Top