కర్నూలు జిల్లాలో ముగిసిన షర్మిల పాదయాత్ర

కర్నూలు, 22 నవంబర్‌ 2012:  షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం మధ్యాహ్నంతో కర్నూలు జిల్లాలో ముగిసింది. తుంగభద్ర వంతెన మీదుగా ఆమె గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో షర్మిల 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించి 195 కిలోమీటర్లు నడిచారు. కాగా, కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర ముగిసే సమయానికి ఆమె మొత్తం 466 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. షర్మిల పాదయాత్రకు కర్నూలు జిల్లా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పుల్లూరు క్రాస్‌రోడ్డు వద్ద షర్మిలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జిల్లా వాసులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది తరలి వచ్చి ఘనంగా సాదర స్వాగతం పలికారు.
Back to Top