'కళ్లున్నా చూడరు... చెవులున్నా వినరు'


ఎల్బీనగర్ (రంగారెడ్డి జిల్లా): పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఆరోపించారు. కళ్లున్నా చూడరు... చెవులున్నా ప్రజల గోడు వినిపించుకోవడంలేదని మండి పడ్డారు. ప్రజా సమస్యలను ఈ  కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.

     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా 57వ రోజు రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల పర్యటిస్తున్నారు.  దారి పొడవునా శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజలు ప్రాంతాలకతీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీడీ గార్డెన్స్ వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

     గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 6 మాత్రమే సబ్సిడీ మీద ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన ఆరు మాసాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు ఇవ్వకుండా నగదు మాత్రమే ఇస్తామని పాలకులు చెబుతున్నారని, ఆ డబ్బుతో పది రోజులకు సరిపడే గాసం కూడా రాదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా బతికేదని వాపోయారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు భారంగా పరిణమించాయని పలువురు శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు.

     ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, మహానేత మహిళలను తన సొంత బిడ్డలుగా చూసుకున్నారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది నిరుపేదలను ఆదుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం ఫీజులు చెల్లించలేని నిరు పేదలకు విద్యాభ్యాసం అందకుండా చేసిందని ఆరోపించారు. మీరంతా దీవిస్తే జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top